Breaking News

గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే.. ఆ టిక్కెట్లకు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో జనరల్ క్లాస్ టిక్కెట్లను రిజర్వేషన్ కేటగిరీగా రైల్వే శాఖ మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లను పునరుద్ధరిస్తున్నట్టు సోమవారం రైల్వే శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జనరల్‌ క్లాస్‌లో ప్రయాణికులు కరోనాకు ముందులా అప్పటికప్పుడు టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించవచ్చు. కోవిడ్‌ సమయంలో రద్దీని నియంత్రించడానికి ఈ జనరల్‌ క్లాస్‌ టికెట్లనూ రిజర్వేషన్‌ కేటగిరీగా మార్చి అందులో ఉన్న సీట్ల సంఖ్య వరకు మాత్రమే రైల్వేశాఖ విక్రయించేది. అందుకోసం రిజర్వేషన్‌ ఛార్జీ కింద రూ.20 అదనంగా వసూలుచేసేది. ఇప్పుడు వాటిని కొవిడ్‌ ముందునాటి మాదిరి మార్చినందున జనరల్‌క్లాస్‌ టికెట్‌ తీసుకొనేవారు ఇకపై రూ.20 అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. జనరల్ క్లాస్ టిక్కెట్లను రిజర్వ్‌డ్ కేటగిరీ నుంచి తొలగించడంతో ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఊరట లభిస్తుంది. సాధారణ సర్వీసుల పునరుద్ధరణకు రెండు విధానాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు కొన్ని రైళ్లలోని జనరల్‌ కోచ్‌లలో రిజర్వ్‌డ్ సీట్ల ముందస్తు బుకింగ్ ఉంటే, గరిష్టంగా 120 రోజుల వరకు ఆ కోచ్‌లకు ఎలాంటి అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు జారీ చేయరు. టికెట్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం 120 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తున్నాయి. రెండోది రైలులోని జనరల్ కోచ్‌లలో టిక్కెట్‌ల ముందస్తు బుకింగ్ లేకపోతే ప్రయాణీకులు వెంటనే ప్రయాణించడానికి అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లను జారీచేస్తారు. సాధారణ రైళ్లలో జనరల్ కోచ్‌లు మహమ్మారికి ముందున్న మాదిరిగానే రిజర్వ్‌డ్ లేదా అన్‌రిజర్వ్‌డ్‌గా కేటాయించనున్నట్లు రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశంలో కరోనా కట్టడికి 2020 మార్చిలో లాక్‌డౌన్ విధించిన తర్వాత ప్రయాణికుల రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. ఆంక్షలు సడలించిన అదే ఏడాది మే 15 తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో పట్టాలెక్కించారు. గతేడాది డిసెంబరు వరకూ ప్రత్యేక రైళ్లగానే నడిపి.. అదనపు ఛార్జీలు వసూలు చేశారు.


By March 01, 2022 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railways-to-restore-unreserved-seats-in-general-coaches-in-mail-and-express-trains/articleshow/89912617.cms

No comments