దారితప్పిన గురువు.. తాగి విద్యార్థిని బ్యాట్‌తో కొట్టిన టీచర్
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. దారి తప్పాడు. విలువలు గురించి చెప్పాల్సిన టీచరే వాటిని గాలికి వదిలేశాడు. పిల్లల దగ్గర ఎంతో సహనంగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయుడు.. వారి పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఛత్తీస్ గఢ్‌లో ఓ టీచర్ పాఠశాలకు తాగి వెళ్లడమే కాకుండా విద్యార్థిని విపరీతంగా కొట్టాడు. జష్‌పూర్‌లోని ఓ ఉపాధ్యాయుడు తాగి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. మార్చి 10వ తేదీన దినేష్ కుమార్ లక్ష్మే మద్యం సేవించి పాఠశాలకు వెళ్లి.. తరగతి గదిలో విద్యార్థిని క్రికెట్ బ్యాట్తో కొట్టాడు. దీనిపై అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అతనిని వెంటనే సస్పెండ్ చేశారు. ఆ ఆర్డర్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో దుబ్బాక మండలం పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పద్మనాభునిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేసే అమ్మన సంజీవరెడ్డి అనే టీచర్ తాగి స్కూల్‌కి వెళ్లి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. ఒక్కోసారి విద్యార్థులను విపరీతంగా కొట్టేవాడు. చివరికి ఉన్నతాధికారులు ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
By March 13, 2022 at 09:48AM
No comments