Breaking News

ఉక్రెయిన్ అధ్యక్షుడి హత్యకు ప్లాన్.. రంగంలోకి 400 మంది కిరాయి గూండాలు!


ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతోంది. ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు పథకం వేసిందని బ్రిటన్‌కు చెందిన టైమ్స్ పత్రిక సంచలన కథనం వెలువరించింది. జెలెన్‌‌స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ ఆ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. వీరు ప్రత్యేకంగా శిక్షణ పొందారని తెలిపింది. వాగ్నర్ గ్రూప్‌గా చెప్పుకుంటోన్న వీరంతా ఒక ప్రైవేటు మిలిషియాకు చెందినవారని, ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్యచేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఆ బృందానికి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది. టైమ్స్ కథనం ప్రకారం.. ఈ వాగ్నర్‌ గ్రూప్‌ను పుతిన్ సన్నిహితుడు యేవ్జనీ ప్రీగోజిన్ నిర్వహిస్తుండగా... అతడ్ని చెఫ్ అని పిలుస్తారట. రష్యా అధ్యక్షుడు అప్పగించిన పని మీద ఐదు వారాల క్రితమే ఆఫ్రికా నుంచి కిరాయి గుండాలు వచ్చినట్టు పేర్కొంది. ఆ గ్రూప్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం.. 2 వేల నుంచి 4 వేల మంది కిరాయి గుండాలు జనవరిలోనే ఉక్రెయిన్ చేరుకున్నారు. వారిలో కొందరు వేర్పాటు వాద ప్రాంతాలైన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వెళ్లారని, 400 మంది బెలారస్‌ నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి, కీవ్‌ దిశగా వెళ్లారని చెప్పారు. ఈ పని కోసం వారికి భారీగానే ఆర్థిక లాభం చేకూరనుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు, ప్రధాని, కీవ్‌ మేయర్ సహా 23 మంది ఆ గ్రూప్‌ టార్గెట్‌ లిస్ట్‌లో ఉన్నారు. శాంతి చర్చలు మొదలు కావడంతో పుతిన్‌ తన పథకం అమలును వాయిదా వేసినట్టు భోగట్టా. ఈ విషయాన్ని వాగ్నర్ గ్రూప్‌లోని సీనియర్ సభ్యుడి సన్నిహితుడిని ఉటంకిస్తూ కథనం పేర్కొంది. ఇక, ఇరు దేశాల మధ్య తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. బుధవారం మరోసారి రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి. రష్యా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ 23 మందిని హత్య చేస్తారని పేర్కొంది. వాగ్నర్ గ్రూప్ తమ దేశంలోకి ప్రవేశించిన విషయం ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి గత శనివారమే తెలిసింది.. రాజధాని కీవ్‌లో ఆ కిరాయి మూకలను పట్టుకోడానికి 36 గంటలపాటు కఠినమైన కర్ఫ్యూ ప్రకటించింది. ఆ సమయంలో పౌరులెవరైనా గడపదాటి కాలు బయటపెడితే వారిని క్రెమ్లిన్‌ ఏజెంట్లుగా భావించి ప్రాణాలు తీస్తామని హెచ్చరించింది. వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ మిలిటరీ, సెక్యూరిటీ కంపెనీ. క్రెమ్లిన్ తన వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చడానికి దీన్ని ఉపయోగిస్తుందని నమ్ముతారు. దీన్ని 2014లో స్థాపించారు. రష్యా మొదటి లక్ష్యం తాను, తన కుటుంబమేనని జెలెన్‌స్కీ ఇది వరకే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కథనం వెలువడటం సంచలనంగా మారింది. యేవ్జనీ ప్రీగోజిన్ (58)కు ‘పుతిన్స్‌ షెఫ్‌’అనే పేరు కూడా ఉంది. 1990ల్లో ఇతడు కేటరింగ్‌ వ్యాపారం చేసుకునే ప్రీగోజిన్‌కు.. 2001లో పుతిన్‌తో పరిచయమైంది. అప్పట్నుంచీ క్రెమ్లిన్‌కు ఇతడి కంపెనీనే ఆహారాన్ని సరఫరా చేస్తోంది. అందుకే ‘పుతిన్స్‌ షెఫ్‌’ అనే పేరు వచ్చింది. కేటరింగ్‌తోపాటు రకరకాల చీకటి వ్యవహారాల్లో భాగస్వామి అయిన యేవ్జనీ.. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మారాడు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నాడనే కారణంతో యూఎస్‌ ఇతడిపై కఠిన ఆంక్షలు విధించింది. ఎఫ్‌బీఐ టాప్‌ 10 మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ప్రిగోజిన్‌ ఆచూకీ చెబితే 2.5 లక్షల డాలర్ల నజరానా చెల్లిస్తామని అమెరికా ప్రకటించింది.


By March 02, 2022 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/400-assassins-flown-in-ukrainian-for-president-zelensky-to-be-assassinated/articleshow/89936912.cms

No comments