Breaking News

PMLA మాల్యా, నీరవ్‌, చోక్సీ సహా పలువురు నుంచి 18,000 కోట్లు స్వాధీనం: కేంద్రం వెల్లడి


బ్యాంకులకు రుణాల ఎగవేత కేసుల్లో వ్యాపారవేత్తలు విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రూ.18,000 కోట్లు జప్తు చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. అలాగే, నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం-2002ను తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,700 కేసులను ఈడీ విచారించిందని పేర్కొంది. అన్ని కేసుల్లో కలిపి మొత్తం రూ.67,000 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. మనీల్యాండరింగ్ కేసుల్లో ఈడీకి విశేష అధికారాలను కట్టబెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వివరాలను అందజేసింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కోర్టులు కల్పిస్తున్న రక్షణ కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు ఇప్పటికీ ఎలా నిలిచిపోయిందో, రికవరీ దశను దాటలేదని గణాంకాలు ప్రతిబింబిస్తాయని అన్నారు. ‘‘వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిన కొందరు వ్యక్తులు న్యాయస్థానాల రక్షణ పొందుతున్నారు.. ఇప్పటి వరకు న్యాయస్థానాలు నిర్భంధ చర్యల ద్వారా ₹ 67000 కోట్లను స్వాధీనం చేసుకున్నాయి’’ అని అన్నారు. లేదా పీఎంఎల్ఏలో ఇటీవల చేసిన సవరణలతో దుర్వినియోగమవుతోందని కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహిత్గీ సహా పలువురు సీనియర్ న్యాయవాదులు ఇటీవల కొద్ది వారాలుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కఠినమైన బెయిల్ షరతులు, అరెస్టుకు గల కారణాలను తెలియజేయకపోవడం, ఈసీఐఆర్ (పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌కు సమాంతరంగా) సరఫరా చేయని వ్యక్తుల అరెస్టు, మనీ లాండరింగ్ నిర్వచనం విస్తృతి, విచారణ సమయంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సాక్ష్యంగా పరిగణించడం అనేక అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ విమర్శలను సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో విదేశాల పరిస్థితితో పోల్చితే భారత్‌లో చాలా స్వల్ప కేసుల్లో మాత్రమే పీఎంఎల్ఏ చట్టం కింద విచారణ జరుగుతున్నాయని అన్నారు. ఉదాహరణకు మనీ లాండరింగ్ చట్టం కింద ఏడాదికి యూకేలో 7,900 కేసులు, చైనాలో 4,691 కేసులు, బెల్జియంలో 1,862 కేసులు, హాంకాంగ్‌లో 1,823 కేసులు అమెరికాలో 1,532 కేసులు, ఆస్ట్రియాలో 1,036 కేసులు నమోదవుతున్నాయని జస్టిస్ ఏంఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనానికి వివరించారు. భారత్ విషయానికొస్తే ఐదేళ్లలో ప్రతి సంవత్సరం విచారణ కోసం తీసుకున్న కేసుల సంఖ్య 2015-16లో 111 నుంచి 2020-21లో 981కి చేరిందన్నారు. అంతేకాదు, 2016-17 నుంచి 2020-21 మధ్య గత ఐదేళ్లలో ఇటువంటి నేరాల్లో 33 లక్షల ఎఫ్ఐఆర్‌లు నమోదయితే, కేవలం 2,086 కేసులను మాత్రమే విచారణ చేపట్టామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది.


By February 24, 2022 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/18000-crore-returned-to-banks-from-vijay-mallya-and-nirav-modi-and-others-says-centre/articleshow/89787631.cms

No comments