Breaking News

HBD Brahmanandam: కింగ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ లైఫ్‌ జర్నీ.. దటీజ్ బ్రహ్మానందం!!


సిల్వర్ స్క్రీన్‌పై అనే పేరు పడిందంటే చాలు ప్రేక్షకులు హుషారెత్తిపోతారు. సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్లకు ఉండే ఈ క్రేజ్ అనేది కమెడియన్లలో ఒక్క బ్రహ్మానందంకి మాత్రమే సొంతం అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చక్కిలిగింతలు పెట్టారు ఈ నవ్వుల రారాజు. నేటికీ సినిమాల్లో అప్పుడప్పుడూ తళుకున్న మెరుస్తూ థియేటర్లను నవ్వులతో ముంచెత్తుతున్న బ్రహ్మి పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 1). ఈ సందర్భంగా హాస్య బ్రహ్మకి 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఆ నవ్వుల ప్రయాణంపై ఓ లుక్కేద్దామా.. బ్రహ్మి పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో కన్నెగంటి నాగలింగాచారి- లక్ష్మీనరసమ్మ దంపతులకు ఆయన జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చిన ఆయన.. భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో MA పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు ఈ ఎక్స్‌ప్రెషన్ కింగ్. నరేశ్ హీరోగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో హీరోకి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు బ్రహ్మానందం. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశారు. ఇక బ్రహ్మానందం సుడి తిప్పిన సినిమా జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన 'అహ నా పెళ్లంట' సినిమా. ఈ మూవీలో బ్రహ్మి చేసిన అరగుండు రోల్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ''పోతావురా...రేయ్‌...నాశనమై పోతావ్'' అంటూ బ్రహ్మి పలికిన పదాలు, ఆ హావాభావాలు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. ఆ తర్వాత వెండితెరపై తన మార్క్‌ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్‌కి తిరుగులేని బాట వేసుకున్నారు బ్రహ్మానందం. ఆయన అవ‌కాశాల‌కు అకాశ‌మే హ‌ద్ద‌యింది. జంధ్యాల ఏం మంత్రించి ఆయ‌న్ను ఇండ‌స్ట్రీలోకి వ‌దిలారో.. బ్ర‌హ్మానందం కామెడీకి టాలీవుడ్ అంత‌లా అడిక్ట్ అయిపోయింది. క్రమంగా సినీ దర్శకనిర్మాతలకే కాదు టాప్‌ హీరోలకు కూడా ఫేవరేట్‌గా మారిపోయి సినిమా విజయంలో కీ రోల్ పోషించే స్థాయికి ఎదిగారు బ్రహ్మి. ఆయన నవ్వినా, ఏడ్చినా, కోప్పడినా, చికాకు పడినా, వెటకారంగా చేసినా.. ఇలా ఏం చేసినా బ్రహ్మి కామెడీకి వంకపెట్టే ప్రేక్షకుడే కరువయ్యాడు. అరగుండుతో మొదలు పెట్టిన ఆయన ప్రయాణంలో.. ''కిల్ బిల్ పాండే, కత్తి రాందాస్‌, ఖాన్ దాదా, శంకర్ దాదా ఆర్ఎంపి, నెల్లూరి పెద్దారెడ్డి, గ‌చ్చిబౌలి దివాక‌ర్‌, లవంగం, భట్టు , మైఖెల్ జాక్సన్‌, ప‌ద్మశ్రీ‌, ప్రణ‌వ్‌, జ‌య‌సూర్య'' లాంటి పాత్రలు ఈ నాటికీ మరువలేనివి. ఒక్కమాటలో చెప్పాలంటే వెండితెరపై బ్రహ్మానందం పండించిన కామెడీ నభూతో నభవిష్యతి! అనొచ్చు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు బ్రహ్మానందం. సినీ కళామతల్లికి ఆయన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు బ్రహ్మి. ఇక నేటితరం ఆడియన్స్‌ బ్రహ్మి కామెడీని వెండితెరపై కాస్త మిస్ అవుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. సామజిక మాధ్యమాల్లో బ్రహ్మానందం లేని క్షణమే లేదు. మీమ్, GIF, స్టికర్.. ఎక్కడ చూసినా ఆయన హావభావాలే! జనం తమ తమ ఫీలింగ్స్ తెలపడం కోసం ప్రత్యేకంగా బ్రహ్మానందాన్ని వాడేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆయనలో ఓ అద్భుతమైన చిత్రకారుడు కూడా దాడి ఉన్నాడని ఈ మధ్యే జనాలకు తెలిసింది. మరి హాస్యనందుడు పది కాలాలపాటు పచ్చగా ఉండటంతో పాటు మరిన్ని సినిమాల్లో నటించి, మనందరినీ ఇంకా ఇంకా నవ్వించాలని మనసారా కోరుకుందామా!.


By February 01, 2022 at 12:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/brahmanandam-birth-day-special-story-from-samayam-telugu/articleshow/89267510.cms

No comments