Breaking News

Chiranjeevi : చిరంజీవిగారికి ఇష్టం ఉండ‌దు.. కానీ ఆయ‌నే సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద‌.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన రాజ‌మౌళి


సినిమా ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళ్లే పెద్ద ఎవ‌రు? అనే దానిపై చాలా రోజులుగా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. క‌రోనా రెండు వేవ్ త‌ర్వాత ముర‌ళీ మోహ‌న్ స‌హా కొంత మంది సినీ ప్ర‌ముఖులు ఇండ‌స్ట్రీ పెద్ద అని అన్నారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత మోహ‌న్ బాబు డైరెక్ట్‌గా చెప్ప‌లేదు కానీ.. సినీ పెద్ద నేనే అన్న రీతిలో రియాక్ట్ అయ్యారు. సీనియ‌ర్ న‌రేష్ ‘మా’ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఓ సంద‌ర్భంలో మోహ‌న్‌బాబు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుని సినీ ఇండ‌స్ట్రీలో ఏమైమా స‌మ‌స్య‌లుంటే ప‌రిష్క‌రించుకుంటామ‌ని అన్నారు. ఆ త‌ర్వాత సినీ పెద్ద ఎవ‌ర‌నే దానిపై ఏదో ఒక రూపంలో చ‌ర్చ న‌డుస్తూనే వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చిరంజీవి తాను ఇండ‌స్ట్రీకి పెద్ద‌రికం వ‌హించ‌నని చెప్పేశారు. సినీ ఇండ‌స్ట్రీకి స‌మ‌స్య అంటూ వ‌స్తే సినీ ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా తాను ముందుంటానే త‌ప్ప‌, పంచాయ‌తీలు చేయ‌న‌ని చెప్పేశారు. అదే రోజున మోహ‌న్‌బాబు ఇండ‌స్ట్రీలో అంద‌రినీ క‌లుపుకుని వెళ్లి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలే త‌ప్ప‌, ఇండ‌స్ట్రీ అంటే ఏ ఒక్కరో కాదంటూ పెద్ద లేఖ కూడా రాశారు. ఈ గొడ‌వ‌లు ఇలా కొన‌సాగుతుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినీ థియేట‌ర్స్ టికెట్ రేట్స్ త‌గ్గించ‌డం అనేది సినీ నిర్మాత‌ల‌కు ఇబ్బందిగా మారింది. దీంతో సినీ పెద్ద‌లు చాలా మంది వెళ్లి ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ నేప‌థ్యంలో గురువారం చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేష్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, పోసాని, అలీ, ఆర్‌.నారాయ‌ణ మూర్తి త‌దిత‌రులు వెళ్లి జ‌గ‌న్‌తో భేటి అయ్యారు. భేటి అనంత‌రం ప్ర‌భాస్‌, మ‌హేష్ అంద‌రూ జ‌గ‌న్‌కు థాంక్స్ చెబుతూనే స‌మ‌స్య‌ను ముందుండి ప‌రిష్క‌రించ‌డానికి పూనుకున్న చిరంజీవికి కూడా థాంక్స్ చెప్పారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి జ‌గ‌న్‌కు, మంత్రి పేర్ని నానికి థాంక్స్ చెబుతూ చిరంజీవికి సినీ పెద్ద అంటే న‌చ్చ‌ద‌ని, కానీ ఆయ‌న‌కు న‌చ్చ‌క‌పోయినా ఆయ‌నే ఇప్పుడు సినీ పెద్ద అని త‌న సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చేశారు.


By February 11, 2022 at 12:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajamouli-intresting-comments-on-chiranjeevi-after-meeting-with-ap-cm-ys-jagan/articleshow/89487728.cms

No comments