Breaking News

ఇకపై కార్లలో త్రీ పాయింట్ సీట్ బెల్ట్ తప్పనిసరి: ఆ దస్త్రంపై కేంద్ర మంత్రి సంతకం


కార్లలో ఇకపై ముందు సీట్లకు త్రీ పాయింట్‌ సీట్‌బెల్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. వెనుక వరుసలోని మధ్య సీటుకూ ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. రహదారి భద్రతపై గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ... ఆటోమొబైల్ సంస్థలు త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై బుధవారం తాను సంతకం చేసినట్లు తెలిపారు. అయితే, ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చాలా కార్లలో ముందు వైపు సీట్లు, వెనుక వరుసలోని రెండు రియర్‌ సీట్లకు మాత్రమే త్రీ పాయింట్‌ సీట్‌బెల్ట్‌ వ్యవస్థ ఉంటుంది.. మధ్య సీటుకు టూ పాయింట్‌ లేదా ల్యాప్‌ సీట్‌బెల్టులే ఉంటున్నాయి. వచ్చే మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలను 50 శాతం మేర తగ్గించాల్సిన అవసరం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు, నిబంధనలను అనుసరించి వాహనాలకు స్టార్‌ రేటింగ్‌ ఇచ్చే ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల వినియోగదారులు వాహన స్థాయిని అంచనావేసి కొనుగోలు చేయడంపై నిర్ణయానికి వస్తారన్నారు. ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ స్టెబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సిస్టమ్స్‌, ప్రమాదకరమైన వస్తువుల రవాణా, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రయాణం, డ్రైవర్‌ మత్తులో ఉన్నప్పుడు హెచ్చరించే వ్యవస్థ, ప్రమాదకరమైన మలుపుల గురించి సమాచారం తెలిపే విధానం, జాతీయరహదారులపై లైన్‌లను తప్పినప్పుడు హెచ్చరించే వ్యవస్థలను ప్రస్తుతం అమలుచేయనున్నట్లు గడ్కరీ వివరించారు. శబ్ద, వాయు కాలుష్య నియంత్రణ కోసం విద్యుత్తుతో నడిచే వాహనాలను వినియోగించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. రహదారుల ప్రమాదాల నివారణకోసం అన్ని మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందన్నారు. పర్యావరణహిత హైడ్రోజన్‌తో నడిచే టయోటా వాహనాన్ని మార్చి 15న ప్రారంభించనున్నట్లు చెప్పారు. జాతీయరహదారులపై వాహనాల గరిష్ఠ వేగాన్ని 120 కి.మీ.కు పెంచుతూ కేంద్రం విడుదల చేసిన ఉత్తర్వులను మద్రాస్‌ హైకోర్టు పక్కన పెట్టడంపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్లు గడ్కరీ తెలిపారు. వివిధ రకాల రహదారులపై వాహనాల గరిష్ఠ వేగాలను సవరించే బిల్లును సిద్ధం చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. కాగా, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు 8 మంది ప్రయాణించగలిగే మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ఈ ఏడాది అక్టోబరు నుంచి తప్పనిసరి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గత నెలలో తెలిపింది.


By February 11, 2022 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-point-seat-belts-mandatory-for-all-front-facing-passengers-in-car-says-nitin-gadkari/articleshow/89491746.cms

No comments