Breaking News

తానా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ వేడుకలు


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21, 2022న భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు వర్చువల్‌గా ప్రత్యేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని వివరిస్తూ, పర దేశంలో ఉంటూనే మాతృభాషను పరిరక్షించి పరివ్యాప్తం చేయడంలో తానా చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆహ్వానం పలికారు. ముందుగా ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖా మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ల గురుప్రసాద రావుల మృతి పట్ల తానా తరఫున ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ముఖ్య అతిథి గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరి బాబు మాట్లాడుతూ.. మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉంటూ కూడా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ పేరిట తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సాహిత్య సదస్సులు నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ‘‘భారత రాజ్యాంగంలోని 53వ అధికరణం ప్రకారం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాభోధన జరగాలి.. కేంద్రప్రభుత్వ 2020 నూతన విద్యావిధానం అనుసరించి కనీసం 5 వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధనతో పాటు ఇంజనీరింగ్ లాంటి వృత్తి విద్యలలో కూడా మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయి... మాతృభాషాభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ మన తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘‘ప్రతి ఏటా ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణం నాటి తూర్పు పాకిస్థాన్ ఇప్పటి బంగ్లాదేశ్‌లో అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై అప్పటి పాక్ ప్రభుత్వం ఉర్దూను జాతీయ భాషగా బలవంతంగా రుద్దింది. దీనిపై అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేస్తూ సాగించిన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952లో ఎంతో మంది మరణించారు.. కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుంచి ఏటా ఫిబ్రవరి 21 ని అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది” అని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. అంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి మన మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఒక విషయాన్ని మనం మాతృభాషలో అర్ధం చేసుకున్న వివరంగా ఇతర భాషల్లో అర్ధం చేసుకోలేమని, పరిపాలనా భాషగా కూడా తెలుగు విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. మరో గౌరవ అతిథి మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ.. మిజోరాం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకుని ఉన్న రాష్ట్రమని, అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉందన్నారు. చాలా తక్కువ మంది తెలుగు వారు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శరవేగంతో ప్రగతి పథంలో మిజోరాం దూసుకుపోతుందని తెలిపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు ప్రముఖులు పాల్గొని ఆయా రాష్ట్రాలలో తెలుగు వారి సంఖ్య, తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి వారు చేస్తున్న కృషి, వివిధ హోదాలలో పనిచేస్తూ తెలుగు ఖ్యాతిని నిలబెడుతూన్న అధికార, అనధికార ప్రముఖులు, తెలుగు సంఘాల పాత్ర, తెలుగు రచయితలు యిత్యాది అంశాలపై అత్యద్భుతంగా సమగ్ర విశ్లేషణ చేశారు. శ్రీ దాట్ల దేవదానం రాజు- పుదుచ్చేరి (యానాం), ఆచార్య మాడభూషి సంపత్ కుమార్- తమిళనాడు, శ్రీ యజ్ఞ నారాయణ- కేరళ, శ్రీ విజయభాస్కరరెడ్డి-మహారాష్ట్ర డా. తుర్లపాటి రాజేశ్వరి- ఒడిశా, శ్రీ లండ రుద్రమూర్తి- ఛత్తీస్‌గడ్, శ్రీ రాపోలు బుచ్చిరాములు- గుజరాత్, శ్రీ వింజమూరి బాలమురళి- పశ్చిమ బెంగాల్, ఆచార్య యన్. లక్ష్మి అయ్యర్- రాజస్థాన్, శ్రీమతి కమలాకర రాజేశ్వరి- న్యూఢిల్లీ తదితరుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య, గౌరవ, విశిష్ఠ అతిథులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలను తెలియజేశారు. ఫిబ్రవరి 27 న ‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’ అనే సాహిత్య కార్యక్రమం అంతర్జాల దృశ్య సమావేశం జరుగుతుందని తెలియ జేశారు.


By February 22, 2022 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/tana-prapancha-saahitya-vedika-celebrates-international-mother-language-day-2022/articleshow/89738287.cms

No comments