Breaking News

ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్‌తో సంప్రదింపులు.. బైడెన్ కీలక వ్యాఖ్యలు


ఉక్రెయిన్‌ రష్యా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‘దురాక్రమణదారుడు’ అని, ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఆయన యుద్ధాన్నే ఎంచుకున్నారని బైడెన్‌ మండిపడ్డారు. పుతిన్‌ అన్యాయమైన దాడికి పాల్పడినందుకు ప్రతిగా... మిత్ర దేశాలతో కలిసి రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్‌తో సంప్రదింపులు జరపబోతున్నామని, పూర్తిస్థాయిలో మేము పరిష్కరించలేదని వ్యాఖ్యానించారు. గురువారం అర్ధరాత్రి వైట్‌హౌస్ వద్ద బైడెన్ మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణపై అమెరికాతో భారత్ పూర్తిగా సహకరిస్తుందా? అనే ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. ‘‘రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకమైంది. పుతిన్‌ ప్రాణాంతకమైన, మానవాళికి తీరని బాధను మిగిల్చే యుద్ధాన్ని ఎంచుకున్నారు.. ఈ దాడుల ఫలితంగా చోటుచేసుకునే మరణాలకూ, విధ్వంసానికి రష్యాదే బాధ్యత.. ఉక్రెయిన్‌పై అన్యాయమైన దాడి గురించి జి-7 దేశాల అధినేతలతో మాట్లాడాను. రష్యాపై వినాశకర కఠిన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు మేమంతా అంగీకరించాం. ధీరులైన ఉక్రెయిన్‌ ప్రజలకు అండగా ఉంటాం.. రష్యా నుంచి సైబర్‌ దాడులు జరిగితే, వాటిని సమర్ధంగా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాం.. నాటో మిత్రదేశాలకు మరిన్ని అదనపు బలగాలను పంపుతున్నాం.. యావత్‌ ఐరోపాకూ ఇది ప్రమాదకర సమాయం.. ఉక్రెయిన్‌పై దాడికి రష్యా చెప్పిన భద్రతా కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు.. అందుకే వినాశకర ఆంక్షలు విధిస్తున్నాం.. అమెరికా, మిత్రదేశాలు కలిసి రష్యాకు చెందిన నాలుగు పెద్ద బ్యాంకులను స్తంభింపజేస్తాయి. ఆ దేశ ప్రముఖులకు సంబంధించిన ఎగుమతులు, హైటెక్‌ రంగాలకు చెందిన పరిశ్రమలపైనా ఆంక్షలు విధిస్తాం.. అమెరికా మిలటరీ సెమీ కండక్టర్లను నియంత్రిస్తాం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకు నుంచి బ్యాంకుకు, రష్యా ఇంధన రంగానికి చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడే స్విఫ్ట్‌ చెల్లింపు వ్యవస్థ నుంచి రష్యాను తొలగిస్తాం’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపుతారన్న వార్తలను ఆయన ఖండించారు. రష్యా కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5.40 నుంచి ఉదయం 10 గంటల కల్లా.. ఉక్రెయిన్‌ ఎయిర్‌‌బేస్‌లను, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఆ తర్వాత రక్షణ శాఖకు చెందిన కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకుంది. ఈ క్రమంలో పలు పౌర భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. రక్షణ కార్యాలయాలతోపాటు.. విద్యుత్తు వ్యవస్థే టార్గెట్‌గా క్షిపణి దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌ నావికాదళ కేంద్రాలను కూడా రష్యా వైమానిక దళం ధ్వంసం చేసింది. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇరు దేశాలు పరస్పర విరుద్ధ డేటాను అంతర్జాతీయ మీడియాకు విడుదల చేశాయి.


By February 25, 2022 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-to-consult-india-on-ukraine-crisis-says-president-joe-biden/articleshow/89814693.cms

No comments