Breaking News

దేశ వ్యతిరేక పోస్ట్‌లు.. కశ్మీర్ న్యూస్ పోర్టల్ ఎడిటర్ అరెస్ట్


సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక కంటెంట్‌ను షేర్ చేస్తున్నారనే ఆరోపణలపై కశ్మీర్‌కు చెందిన న్యూస్ పోర్టల్ ఎడిటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్ వాలా న్యూస్ పోర్టల్ ఎడిటర్ ఫహద్ షాను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ఫహాద్ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు ఉగ్రవాద కార్యకలాపాలను కీర్తించడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లపై విచారణ జరిపి నిందితుడ్ని గుర్తించామని తెలిపింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులపై విచారణలో ఒక నిందితుడ్ని ఫహాద్ షాను అరెస్ట్ చేశాం.. నిందితుడు పోలీసుల రిమాండ్‌లో ఉన్నాడు.. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే, జర్నలిస్ట్ అరెస్ట్‌ను జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ‘‘సత్యం కోసం నిలబడడం జాతి వ్యతిరేకిగా పరిగణించడం... తీవ్ర అసహనం, నిరంకుశ ప్రభుత్వాన్ని అద్దంలో చూపడం కూడా దేశ వ్యతిరేకమే.. జర్నలిస్ట్ ఫహద్ తనంతట తానుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలియజేయడం భారత ప్రభుత్వానికి రుచించడం లేదు.. ఇంక ఎంతమంది ఫహద్‌లని అరెస్ట్ చేస్తారో?’’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు. అయితే, పోలీసులు మాత్రం నేరపూరిత వైఖరితోనే న్యూస్ పోర్టల్‌లో కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు. ‘‘కొంతమంది ఫేస్‌బుక్ యూజర్లు, పోర్టల్‌లు ప్రజలలో భయాన్ని సృష్టించేందుకు నేరపూరిత ఉద్దేశంతో ఫోటోలు, వీడియోలు, పోస్ట్‌లు సహా దేశ వ్యతిరేక కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు.. అలా అప్‌లోడ్ చేసిన కంటెంట్ శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రజలను రెచ్చగొడుతుంది’’ అని పేర్కొన్నారు. అటువంటి పోస్ట్‌లు ఉగ్రవాద కార్యకలాపాలను కీర్తించడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చట్టాన్ని అమలు చేసే ఏజన్సీల ప్రతిష్టకు భంగం వాటిల్లడం, దేశంపై ద్వేషం, అసంతృప్తిని ఎగదోయడమేనని తెలిపారు.


By February 05, 2022 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-news-portal-editor-arrested-for-anti-national-posts-say-jammu-and-kashmir-cops/articleshow/89359017.cms

No comments