దూసుకెళ్లిన బ్రహ్మోస్, ఉరాన్ క్షిపణులు.. పాక్, చైనాలకు పరోక్షంగా వార్నింగ్
రెండు అత్యాధునిక నౌక-విధ్వంసక క్షిపణులను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్, ఉరాన్ మిస్సైళ్లను అండమాన్ నికోబార్ తీరంలో పరీక్షించినట్లు ఇండియన్ నేవీ అధికార ప్రతినిధి ట్విటర్ ద్వారా వెల్లడించారు. బ్రహ్మోస్ క్షిపణి కొత్త వెర్షన్‌ను ఉపరితలం నుంచి, ఉరాన్ క్షిపణిని నౌక మీద నుంచి పరీక్షించారు. ఈ రెండూ నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా చేరుకున్నాయని నౌకాదళం ప్రకటించింది. జనవరి 20న బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ మిసైల్‌ను ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 12 రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోలను అండమాన్ నికోబార్ కమాండ్ విడుదల చేసింది. ఈ సందర్భంగా క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపింది. ఉరాన్ క్షిపణిని పాత నౌక ఎల్‌సీయూ38 నుంచి పరీక్షించారు. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో భారత్ తన అమ్ములపొదిలోని బ్రహ్మోస్ క్షిపణి కొత్త వేరియంట్‌లను పరీక్షిస్తుండటం గమనార్హం. బ్రహ్మోస్ క్షిపణిలను రష్యా సహకారంతో భారత్ అభివృద్ధి చేసింది. గాలి, ఉపరితలం, సముద్రం నుంచి ప్రయోగించగలిగిన ఈ క్షిపణులను న్యూక్లియర్ వార్‌హెడ్‌లతో పాటు యాంటీ-షిప్, ల్యాండ్-అటాక్ వేరియంట్‌లతో మార్పులు చేసింది. 21వ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన క్షిపణుల్లో ఒకటిగా బ్రహ్మోస్‌కు పేరుంది. బ్రహ్మోస్‌లో బ్రహ్మ అంటే ‘బ్రహ్మపుత్ర’ మోస్ అంటే ‘మస్క్వో’. రష్యాలో ప్రవహించే నది పేరు. భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ద్వారా సబ్‌మెరైన్‌లు, నౌకలు, సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. లక్ష్యాలను చేధించడంలో బ్రహ్మోస్ క్షిపణికి కచ్చితత్వం ఎక్కువగా ఉంది. ఇది గంటకు 4300 కి.మీ వేగంతో శత్రు స్థానాలను ధ్వంసం చేయగలదు. దీని పరిధి 400 కి.మీ. శత్రువుల రాడార్ నుంచి తప్పించుకునే సాంకేతికత దీని అదనపు బలం.
By February 03, 2022 at 07:57AM
No comments