జూలో సెక్యూరిటీని చంపి మరో సింహంతో కలిసి పారిపోయిన మృగరాజు
జంతు ప్రదర్శశాలలోని ఓ అక్కడ కాపలాదారుడిపై దాడిచేసి హతమార్చి.. మరో సింహంతో కలిసి పారిపోయింది. ఈ భయానక ఘటన ఇరాన్‌లోని జూలో చోటుచేసుకుంది. మర్కాజీ ప్రావిన్సుల్లోని అరక్ జంతు ప్రదర్శనశాలలో చాలా కాలం నుంచి ఎస్పందానీ జాతికి చెందిన ఓ సింహం జీవిస్తోంది. అయితే, ఆదివారం నాడు ఎలాగోలా ఆ బోను తలుపులను తెరిచిన సింహం.. ఆహారాన్ని అందించేందుకు వెళ్లిన కాపలాదారుడి (40)పై దాడి చేసింది. అతడిని తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దాడి అనంతరం బోనులో నుంచి బయటకు వచ్చిన ఆ సింహం సహచర మృగరాజుతో కలిసి తప్పించుకుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అవి తమపై ఎక్కడ దాడిచేస్తాయోనని ఆందోళన చెందారు. జంతు ప్రదర్శనశాల నుంచి రెండు సింహాలు పారిపోవడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పైఅధికారులకు తెలియజేయడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఆ జూను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రావిన్సుల గవర్నర్ ఆమిర్ హాది వెల్లడించారు. జూ నుంచి పారిపోయిన ఆ సింహాలను తిరిగి పట్టుకున్నారని వివరించారు. ఈ సింహాలు జూ నుంచి ఆదివారం పరారయ్యాయని తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? లేక సింహామే బోనును తెరిచిందా? అనేది విచారణలో వెల్లడవుతుందని పేర్కొన్నారు. రాజధాని టెహ్రాన్‌కు నైరుతిగా 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్కాజీ ప్రావిన్సుల్లోని అరక్ జూ ఆ దేశంలోని అతిపెద్ద జంతు ప్రదర్శన శాలలో అరక్ జూ ఒకటి. ఇది మొత్తం 32 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 46 జాతులకు చెందిన 460 వరకూ జంతువులు, వన్యప్రాణులు ఉన్నాయి. పర్షియన్ పసుపు జింకలు, పొట్టేళ్లు, ఎలుగుబంట్లు, రాబందులు తదితర వన్యప్రాణులకు ఇది నిలయం.
By February 01, 2022 at 08:29AM
No comments