లక్నోలోని 9 సీట్లకు బీజేపీ అభ్యర్థుల ఖరారు.. ములాయం కోడలికి భంగపాటు!
సుదీర్ఘ చర్చల అనంతరం లక్నోలోని మొత్తం 9 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో సీట్లు ఆశించిన ములాయం కోడలు , బీజేపీ ఎంపీ కుమారుడు మయాంక్ జోషిల పేర్లు జాబితాలో లేవు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరదలైన అపర్ణ యాదవ్.. ఇటీవలే కాషాయదళంలో చేరిన విషయం తెలిసిందే. వీఆర్ఎస్ తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి రాజేశ్వర్ సింగ్‌కు సరోజ్ నగర్ టిక్కెట్‌ను కేటాయించారు. ఈ స్థానం నుంచి పోటీకి ఆశించిన యూపీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్, ఆమె భర్త దయాశంకర్ సింగ్‌లకు భంగపాటు తప్పలేదు. రాజేశ్వర్ సింగ్ స్వచ్ఛంద పదవీవిరమణను కేంద్ర ప్రభుత్వం మంగళవారమే ఆమోదించింది. ఆయన రాజీనామా ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే సరోజ్ నగర్ సీటును కేటాయించడం చెప్పుకోదగ్గ అంశం. ఇక, అపర్ణ యాదవ్, మయాంక్ జోషిలు లక్నో కంటోన్మెంట్ సీటుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇద్దర్నీ కాదని మంత్రి బ్రిజేష్ పాఠక్‌కు ఈ స్థానం నుంచి పోటీకి దింపుతున్నారు. 2017 ఎన్నికల్లో ములాయం కోడలు అపర్ణ.. బీజేపీ నుంచి పోటీచేసిన రీటా బహుగుణ జోషి చేతిలో ఓటమిపాలయ్యారు. అలాగే, లక్నో తూర్పు నియోజకవర్గం నుంచి మరో మంత్రి అశుతోష్ టాండన్, లక్నో సెంట్రల్ నుంచి రంజనీశ్ గుప్తాలకు టిక్కెట్ లభించింది. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో లక్నోలని మొత్తం 9 సీట్లకుగానూ బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుండగా.. మార్చి 7న చివరి దశ పోలింగ్ జరుగుతుంది. ఫలితాలను మార్చి 10న వెల్లడిస్తారు.
By February 02, 2022 at 08:53AM
No comments