Breaking News

విమానం క్రాష్ ల్యాండ్.. రూ.85 కోట్లు చెల్లించాలని పైలెట్‌కు నోటీసులు


కోవిడ్ మహమ్మారి సమయంలో తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ఓ పైలట్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. దానికోసం ఆ విమాన పైలట్‌కు ప్రభుత్వం భారీగా ఫైన్ విధించింది. ఏకంగా రూ.85 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న టైంలో పైలెట్ కెప్టెన్ మాజిద్ అక్తర్, తన కో పైలెట్‌తో కలిసి కరోనా శాంపిల్స్, ఔషధాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విమానంలో తరలించారు. కెప్టెన్ మాజిద్‌ అక్తర్‌ 2021 మే 6న ఎయిర్ క్రాఫ్ట్‌లో 71 బాక్సుల రెమ్ డెసివిర్ ఔషధాలతో అహ్మదాబాద్ నుంచి గ్వాలియర్ పయనం అయ్యాడు. అయితే గ్వాలియర్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. రన్ వేపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను బలంగా ఢీకొంది. దాంతో విమానం క్రాష్ ల్యాండైంది. ఆ సమమంలో విమానంలో పైలెట్ మాజిద్ అక్తర్, కో పైలెట్ శివ్ జైస్వాల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారి దిలీప్ ద్వివేది ఉన్నారు. వారు ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం మాత్రం పనికిరాకుండా పోయింది. దీంతో పైలట్ మాజిద్ అక్తర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయన లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. అయితే తాజాగా క్రాష్ ల్యాండింగ్ కారణంగా విమానం ధ్వంసమైంది. దీని కోసం జరిమానా చెల్లించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పైలట్‌కు నోటీసులిచ్చింది. రూ.85 కోట్లు నష్టపోయామని, రూ.60 కోట్ల ఎయిర్ క్రాఫ్ట్ తుక్కు అయిందని ప్రభుత్వం పేర్కొంది. దానికి బదులుగా వినియోగించిన ప్రైవేట్ ఆపరేటర్ల విమానాలకు రూ.25 కోట్లు కట్టాల్సి వచ్చిందని నోటీసులో పేర్కొంది. ఆ డబ్బును చెల్లించాల్సిందిగా కోరింది. ఈ నోటీసులపై పైలట్ అక్తర్ స్పందించారు. విమానాశ్రయంలో బ్యారియర్ అడ్డుగా ఉన్న విషయమై తమకెలాంటి సమాచారం ఇవ్వలేదని, ముఖ్యంగా బీమా చేయించకుండా విమానం ఎగిరేందుకు పర్మిషన్ ఎవరిచ్చారో విచారణ జరగాలని కోరారు.


By February 08, 2022 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/plane-crashed-on-gwalior-runway-madhya-pradesh-government-sent-a-bill-of-rs-85-crore-to-pilot-for-recovery/articleshow/89418660.cms

No comments