వారంలో రెండు రోజులు భౌతిక విచారణలు.. ఫిబ్రవరి 14 నుంచి అమలు
కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో సుప్రీంకోర్టులో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు జరగనున్నాయి. ఢిల్లీలో కోవిడ్ కేసులు తగ్గుదలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల తగ్గడంతో లాయర్ల కమిటీతో ఆయన సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కోర్టులో వారానికి రెండురోజులు అంటే ప్రతి బుధ, గురువారాల్లో భౌతిక విచారణలు చేపట్టనున్నారు. సోమ, శుక్రవారాల్లో విచారణలు ఆన్‌లైన్‌లో సాగుతాయి. మంగళవారం కూడా భౌతిక విచారణ చేపడతారు. కక్షిదారుల తరఫున అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్ విచారణకు అనుమతిస్తారు. ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ పద్ధతుల్ని సవరిస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సర్క్యులర్ జారీ చేసింది. ఏ తరహా విచారణలకు ఎంతమందిని అనుమతించేదీ దీనిలో పేర్కొంది. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గడంతో పాటు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన వివిధ సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఢిల్లీలో ఇప్పుడు 7,885 యాక్టివ్ కేసులున్నాయి. 2.62 శాతం పాజిటివిటీ రేటు ఉంది. మరోపక్క రాష్ట్రాల్లో కూడా కోవిడ్ ఆంక్షలను తొలగిస్తున్నారు. ఇప్పటికే కర్ఫ్యూలు ఎత్తివేయగా, పాఠశాలలు కూడా ప్రారంభం అయ్యాయి.
By February 08, 2022 at 08:35AM
No comments