దేశంలో 5 లక్షలు దాటిన కరోనా మరణాలు.. ప్రపంచంలో మూడో దేశంగా భారత్
కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ మహమ్మారితో దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాటికి దేశంలో 5 లక్షలు దాటాయి. దీంతో కరోనా మరణాలు ఐదు లక్షలు దాటిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అత్యధికంగా 9.1 లక్షల మరణాలతో అమెరికా మొదటి స్థానంలోనూ.. 6.3 లక్షల మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నాయి. వాటి తర్వాత 5 లక్షల మరణాలతో భారత్ మూడో స్థానంలోనూ.. 3.3 లక్షల మరణాలతో రష్యా నాలుగో స్థానంలో, 3.07 లక్షలతో మెక్సికో ఐదో స్థానంలో నిలిచాయి. మరణాలు 4 నుంచి 5 లక్షలకు చేరడానికి 217 రోజుల సమయం పట్టింది. దేశంలో 2021 జులై 1కి కరోనా మరణాలు 4 లక్షల మార్క్‌కు చేరాయి. సెకెండ్ వేవ్‌లో రోజూ 2 నుంచి 3 వేల మంది వరకూ మహమ్మారికి బలయ్యారు. ఆ తర్వాత నుంచి మరణాలు తగ్గుముఖం పట్టడంతో ఐదు లక్షలకు చేరడానికి ఎక్కువ సమయం పట్టింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో ప్రజల ప్రాణాలకు రక్షణ లభించినట్టయ్యింది. గతేడాది డిసెంబరు చివరి వరకూ కరోనా మరణాలు తగ్గుతూ వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో థర్డ్ వేవ్ మొదలైనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండటం, వ్యాక్సినేషన్ వల్ల మరణాలు తక్కువగానే చోటుచేసుకున్నాయి. జనవరి 3 అత్యల్పంగా 70 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా మరణాల వారం రోజుల సగటు గురువారం నాటికి 600 దాటింది. మొదటి, సెకెండ్ వేవ్‌లతో పోల్చితే ఇది తక్కువే. కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరినప్పుడు తొలి వేవ్‌లో మరణాలు సగటు 1,176 ఉండగా.. సెకెండ్ వేవ్‌లో 4,000గా ఉంది. ఏదేమైనా, దేశంలో మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నమోదైన మరణాలు అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువే ఉంటాయని అంచనాలున్నాయి. అనేక రాష్ట్రాల మరణ నమోదు డేటా, CMIE గృహ సర్వేలు,సెరో సర్వే వంటి వివిధ పద్ధతుల ఆధారంగా అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్ మరణాలను భారత్ చవిచూసిందని సూచిస్తున్నాయి.
By February 04, 2022 at 08:34AM
No comments