పెళ్లింట పెను విషాదం.. బావి స్లాబ్ కూలిపోయి 13 మంది మృతి
పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహానికి హాజరైనవారు ప్రమాదవశాత్తూ పాడుబడిన బావిలో పడి.. 13 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కుషినగర్‌లో బుధవారం రాత్రి సంభవించింది. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాడుబడిన బావి పైకప్పుపై వీరంతా కూర్చుని ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పైకప్పు శిథిలావస్థలో ఉండటంతో కూలిపోయిందని తెలిపారు. అప్పటి వరకూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా ఏడుపులు, రోదనలతో మిన్నంటింది. బావిలో పడిపోయినవారిని బయటకు తీసి చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రాజలింగం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రమాదవశాత్తు బావిలో పడి 11 మంది అక్కడికక్కడే మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు మాకు సమాచారం అందింది.. ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వివాహ కార్యక్రమంలో కొంతమంది బావి స్లాబ్‌పై కూర్చున్నప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది.. అధిక బరువు వల్ల స్లాబ్ కూలిపోయింది’’ అని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను తక్షణమే చేపట్టి బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులకు ఆయన సూచించారు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.
By February 17, 2022 at 07:38AM
No comments