Ramesh Babu : రమేష్ బాబు పెదకర్మకు హాజరైన మహేష్..వైరల్ అవుతున్న ఫొటో!
ఇటీవల జరిగిన పరిణామాల్లో రమేష్ బాబు మరణం అనేది ఘట్టమనేని ఫ్యామిలీని శోక సంద్రంలో ముంచేసింది. సీనియర్ నటుడు కృష్ణ పెద్ద కుమారుడైన రమేష్ బాబు (56) అనారోగ్య కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోదరుడితో అత్యంత సన్నిహితంగా ఉండే మహేష్ విషయానికి వచ్చేసరికి ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఆయన కోవిడ్ కారణంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. సోదరుడిని చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఇప్పుడు మహేష్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. రమేష్ బాబు పెద్ద కర్మకు హాజరయ్యారు. అన్నయ్య రమేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి పలుమార్లు మహేష్ చెప్పేవారు. రమేష్ బాబు చనిపోయిన రోజున మహేష్ సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరికీ తెలిసిందే. అలాంటి సోదరుడు దూరం కావడం అనేది మహేష్‌కు తీరని లోటే. ఘట్టమనేని కుటుంబానికి చెందిన సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రమేష్ బాబు, మహేష్ బాబు కలిసి సినిమాలు కూడా చేశారు. అప్పుడు మహేష్ బాల నటుడిగా ఉండేవారు. బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు సినిమాల్లో రమేష్ బాబు, మహేష్ బాబు కలిసి యాక్ట్ చేశారు. తండ్రి బాటలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు . తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్రలో కనిపించారు. నటుడిగా అదే ఆయన తొలి సినిమా. తర్వాత మరి కొన్ని చిత్రాల్లో రమేష్ బాబు బాల నటుడిగా కనిపించారు. ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా మారారు. మొత్తం పదిహేను సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమా రంగానికి హీరోగా దూరమయ్యారు. కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత ఆయన నటనకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీదనే కృష్ణ ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు. దూకుడు, ఆగడు చిత్రాలకు రమేష్ బాబు సమర్పకుడిగా ఉన్నారు. తర్వాత సినీ రంగానికి ఎందుకనో దూరమయ్యారు.
By January 23, 2022 at 06:44AM
No comments