Breaking News

అమెరికాలో హైఫ్రొఫైల్ సెక్స్ స్కాం.. జాబితాలో ఇద్దరు మాజీ అధ్యక్షులు, బ్రిటన్ ప్రిన్స్!


తన పేరు ప్రతిష్ఠలను పెంచుకోడానికి సంపన్నులకు ఏళ్లుగా టీనేజీ అమ్మాయిల్ని ఎరగా వేసిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టన్ పాపం పండి చివరకు జైలుకెళ్లాడు. కానీ, జైల్లోనే దిక్కులేని చావు చచ్చాడు. అగ్రరాజ్యంలో విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని బయటపెట్టిన కుంభకోణం సంచలనంగా మారింది. నిందితుడి సన్నిహితుల జాబితాలో ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు.. బ్రిటన్‌ యువరాజు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ ఘోరాల్లో అతడికి సహకరించిన స్నేహితురాలు గిలిన్ మాక్స్‌వెల్‌ తాజాగా దోషిగా తేలడంత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్‌‌లో పుట్టిన జెఫ్రీ ఎపిస్టన్.. డిగ్రీ పూర్తిచేయకుండానే చదువును ఆపేశాడు. అనంతరం 1970ల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరాడు. ఆ పాఠశాలలోని ఓ విద్యార్ధి తండ్రి.. ఎపిస్టన్‌ను చూసి ప్రభావితమయ్యాడు. వాల్‌స్ట్రీట్‌లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఎపిస్టన్‌ అండ్‌ కో అనే అసెట్‌మేనేజ్‌మెంట్‌ పేరుతో సొంతంగా సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థ తక్కువ కాలంలోనే విజయం సాధించింది. బిలియన్‌ డాలర్ల కంటె ఎక్కువ ఉన్నవారికే పనిచేసే ఎపిస్టన్.. నడమంత్రపు సిరితో ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. న్యూమెక్సికోలో స్థలాలు, న్యూయార్క్‌లో అతిపెద్ద ప్రైవేట్‌ హోమ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక్కడ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు. ఎపిస్టన్‌ మిత్రుల్లో క్లింటన్‌, ట్రంప్‌, కెనడీ కుటుంబీకులు, మీడియా దిగ్గజం మద్రోక్‌, మిషెల్‌ బ్లూమ్‌బెర్గ్‌, రిచర్డ్‌ బ్రాన్సన్‌, మైకెల్‌ జాక్సన్‌, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్‌, ఇజ్రాయేల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌, సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వంటి వారు ఉన్నారు. తనవద్ద ఉన్న బోయింగ్‌ 747 విమానంలో హైప్రొఫైల్‌ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని వర్జిన్‌ దీవుల్లోని స్థానికులు ‘లోలితా ఎక్స్‌ప్రెస్‌’గా పిలిచేవారు. తరచూ దీనిలో యువతులు, అమ్మాయిలు అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో ఈ పేరు పెట్టారు. మీడియాకు దూరంగా ఉండేందుకు ఇష్టపడే జెఫ్రీ.. 2002 సెప్టెంబర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, నటులు కెవిన్‌ స్పాసీ, క్రిస్‌ టక్కర్‌తో కలిసి ప్రైవేటు జెట్‌లో ఆఫ్రికా టూర్‌కు వెళ్లారు. ఈ ఘటన మీడియాను ఆకర్షించడంతో ఎపిస్టన్‌ గురించి తెలియజేస్తూ ‘న్యూయార్క్‌’ మ్యాగజైన్‌ ‘రహస్య కుబేరుడు: జెఫ్‌ ఎపిస్టన్‌’ అనే కథనం రాసింది. ఈ కథనం కోసం మాజీ అధ్యక్షుడు, అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా పేరున్న డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయం కూడా తీసుకొంది. ‘‘ఎపిస్టన్ నాకు 15 ఏళ్ల నుంచి తెలుసు.. అద్భుతమైన వ్యక్తి.. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ కథనం వెలువడిన తర్వాత 2003లో ‘న్యూయార్క్‌ ’ పత్రికను చేజిక్కించుకోడానికి జెఫ్రీ విఫల యత్నం చేశాడు. ఆ తర్వాత నుంచి జెఫ్రీ తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. కొన్నాళ్ల తర్వాత ఎపిస్టన్‌, ట్రంప్‌ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తినట్టు ప్రచారం జరిగింది. అలాగే, ఎపిస్టన్‌తో కలిసి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 27సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్‌ రికార్డులు 2016లో వెలుగులోకి వచ్చాయి. మాజీ మిస్‌ స్విడన్‌ ఎవా అండర్సన్‌, గిలిన్‌ మాక్స్‌వెల్‌లతో ఎపిస్టిన్‌ డేటింగ్‌ చేశాడు. కానీ, జీవితంలో ఎవరినీ పెళ్లిచేసుకోలేదు. పేద మధ్య తరగతి బాలికలు, యువతులకు డబ్బులను ఆశగా చూపించి పామ్‌ బీచ్‌ బంగ్లాకు పిలిపించి ప్రముఖులకు వారిని అప్పగించేవాడు. బాధితులకు కొంత డబ్బు ఇచ్చి.. మరోకర్ని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్‌ ఇస్తానని ఆశపెట్టేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకొన్న బాలికలకు ఎలా బయటపడాలో తెలియక ఎపిస్టన్‌ చెప్పినట్లు చేసేవారు. చివరకు 2005లో బండారం బయటపడి అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. ఓ 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎపిస్టన్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పామ్‌ బీచ్‌లోని అతడి భవనంపై పోలీసులు దాడి చేసి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికే ఎపిస్టన్‌ చాలావరకూ ఆధారాలను నాశనం చేయించాడు. కొన్నినేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. జెఫ్రీ కోసం కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రాసిక్యూటర్‌ అలగ్జాండర్‌ ఎకోస్టా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లొంగదీసుకున్న బాలికలను సంపన్నులకు ఎరగా వేసి తన పనులు చేయించుకునేవాడు. ఇలాంటి వారిలో బ్రిటన్‌ రాణీ క్వీన్‌ ఎలిజిబెత్‌-2, ప్రిన్స్‌ ఫిలిప్‌ల రెండో కుమారుడు ప్రిన్స్‌ ఆండ్రూ కూడా ఉన్నాడు. తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు తనతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడని వర్జీనియా గుయిఫ్రే అనే మహిళ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆండ్రూ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని దబాయించాడు. కానీ, 2001లో గుయిఫ్రేతో కలిసి ఉన్న ఫొటో 2010లో లీకైంది. ఆ ఫొటోలో జెఫ్రీ స్నేహితురాలు గిలెన్‌ మ్యాక్స్‌వెల్‌ కూడా ఉండటం గమనార్హం. 2019లో మీటూ ఉద్యమంతో మరోసారి ఎపిస్టన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అదే ఏడాది జులైలో అరెస్టు చేశారు. ఈ సమయంలో ‘ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ’, నకిలీ పాస్‌పోర్టులు అతడి నివాసంలో దొరికాయి. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎపిస్టన్ బాధితుల సంఖ్య 50 మంది వరకూ ఉంటుందని పామ్‌ బీచ్‌ పోలీస్‌ చీఫ్‌ మిచెల్‌ రెయిటర్‌.. ది మియామీ హెరాల్డ్‌ అనే పత్రికకు ఇటీవల వెల్లడించారు. కాగా, జెఫ్రీకి నేరాల్లో సహకరించిన స్నేహితురాలు గిలెన్‌ మ్యాక్స్‌వెల్‌పై తాజాగా ఐదు కేసుల్లో దోషిగా నిరూపితమయ్యారు. 1994-2004 వరకు బాలికలను ఎపిస్టన్‌ వద్దకు పంపేందుకు సహకరించినట్లు తేలింది. దాదాపు 30 మిలియన్‌ డాలర్లను ఆమె సంపాదించినట్లు గుర్తించారు. ఈ కేసుల్లో ఆమెకు 40 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


By January 03, 2022 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-financier-jeffrey-epstein-charged-with-human-trafficking-scam/articleshow/88657474.cms

No comments