ప్రముఖ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత.. అద్నాన్ సమీ సంతాపం
ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కథక్ డ్యాన్సర్‌గానే కాకుండా శాస్త్రీయ గాయకుడు, కవి, డ్రమ్మర్‌గా ఆయన రాణించారు. దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జాన్, బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు బిర్జూ మహారాజ్. సత్యజిత్ రే చిత్రం ‘చెస్ కే ఖిలాడీ’కి సంగీతం అందించారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్న బిర్జూ మహారాజ్.. తన మామ దగ్గర కథక్ నృత్య శిక్షణ తీసుకొని జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. మొదటిసారి ఆయన సోలోగా బెంగాల్‌లోని మన్మథ్ నాథ్ ఘోష్ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చారు. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా కెరీర్ కొనసాగించారు. ఆయన కెరీర్‌లో పద్మ విభూషణ్ సహా పలు అవార్డులను స్వీకరించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం ఇలా ఎన్నో అవార్డ్స్ బిర్జు మహారాజ్ సొంతమయ్యాయి. 'విశ్వరూపం' చిత్రంలో ఆయన నృత్యానికి 2012లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అలాగే 2016 సంవత్సరంలో బాజీరావ్ మస్తానీ రాసిన 'మోహే రంగ్ దో లాల్' పాటకు అందించిన కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు లభించింది. కన్నుమూశారని తెలిసి ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప కథక్ నృత్యకారుడు, తన ప్రతిభతో తరాలను ప్రభావితం చేసిన పండిట్ బిర్జు మహారాజ్ జీ మరణవార్త చాలా బాధగా ఉందని అన్నారు.
By January 17, 2022 at 09:44AM
No comments