హీరోగా.. నిర్మాతగా రమేష్ బాబుకు సినీ రంగంతో ఉన్న అనుబంధం
నాటి హీరో, నిర్మాత.. కృష్ణ తనయుడు, హీరో మహేష్ సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు శనివారం అనారోగ్య సమస్యతో హైదరాబాద్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన బాల నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. హీరోగానూ కొన్ని సినిమాలతో అలరించారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో యువ అల్లూరి సీతారామరాజుగా నటనకు ఓనమాలు దిద్దారు రమేష్ బాబు. 1974లో అంటే 18 వయసులో నటుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. నటుడిగా... అల్లూరి సీతారామరాజు తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు నీళ్లు, చిత్రాల్లో యువ నటుడిగానే మెప్పించారు. 1987లో సమ్రాట్ చిత్రంతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కృష్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, శాంతి ఎనతు శాంతి, నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, అన్నా చెల్లెలు, పచ్చ తోరణం, ఎన్ కౌంటర్ చిత్రాలతో మెప్పించారు. ఇందులో శాంతి ఎనతు శాంతి తమిళ చిత్రం. ఎన్‌కౌంటర్ చిత్రంలో కృష్ణ హీరో అయితే ఓ కీలక పాత్రలో రమేష్ బాబు నటించారు. తర్వాత ఆయన యాక్టర్‌గా సినిమాలకు దూరంగా ఉండిపోయారు. నిర్మాతగా... నటుడిగా సినీ పరిశ్రమకు దూరమైనప్పటికీ నిర్మాతగా మారారు. కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయా స్టూడియోస్‌లో చేసిన సూర్యవంశం హిందీ రీమేక్‌కు రమేష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మహేష్ హీరోగా గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన అర్జున్ చిత్రాన్ని నిర్మించారు. అలాగే మహేష్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన అతిథి చిత్రాన్ని రోనీ స్క్రూవాలాతో కలిసి నిర్మించారు. తర్వాత మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన దూకుడు, ఆగడు చిత్రాలకు రమేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరించారు.
By January 08, 2022 at 11:27PM
No comments