Breaking News

బెంగాల్‌‌‌‌ రైలు ప్రమాదం: మూడేళ్ల తర్వాత తొలిసారి భారీ ప్రాణనష్టం


పశ్చిమ బెంగాల్‌లో గురువారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జల్‌పాయిగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో గువహటి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ (15633) సాయంత్రం 5 గంటల సమయంలో పట్టాలు తప్పింది. రైలు ఒక్కసారిగా భారీగా కుదుపునకు గురికావడంతో ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మొత్తం 12 కోచ్‌లు పట్టాలు తప్పి పల్టీలు కొట్టాయి. ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో 50 మంది గాయపడ్డారు. వీరిలో కనీసం 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, దేశంలో దాదాపు మూడేళ్ల తర్వాత రైలు ప్రమాదంలో ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారని రైల్వే వర్గాలు వెల్లడించాయి. చివరిసారిగా 2019 మార్చి 22న జరిగిన రైలు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 1,053 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 250 మందిని రక్షించినట్టు పేర్కొన్నారు. రైలు న్యూదోహూమోని స్టేషన్ నుంచి సాయంత్రం 4.53 గంటలకు బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని చెప్పారు. ప్రయాణికులంతా భోగలి బిహు వేడుకల కోసం రాజస్థాన్ నుంచి అసోంకి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులకు ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్‌ను అందజేశారు. ఘటనా స్థలికి రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్, రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే త్రిపాఠీ, డైరెక్టర్ జనరల్ తదితరులు చేరుకుని సహాయక చర్యలన పర్యవేక్షించారు. ప్రమాదంలో మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు అందజేస్తామని అధికారులు తెలిపారు.


By January 14, 2022 at 07:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-train-derails-after-34-months-seven-passengers-killed-in-accident/articleshow/88888334.cms

No comments