Breaking News

కోడలి నగలు దాచడం హింస అవ్వదు.. సుప్రీంకోర్టు


వరకట్నం వేధింపుల కేసుల విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా భార్య ఆభరణాలను అత్తింటివారు తమ ఆధీనంలో ఉంచుకోవడం వరకట్న వేధింపుల కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నగలను భద్రపరచడం ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం హింసించడం అవ్వదని తేల్చి చెప్పింది. చట్టంలో పేర్కొన్న హింస క్లాజుకు దీంతో ఎటువంటి సంబంధం లేదని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఓ పంజాబ్ మహిళ తన అత్తింటి వారు తనను హింసిస్తున్నారని, తన నగలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని కేసు పెట్టింది. దీనిపై విచారించిన పంజాబ్, హర్యాణా హైకోర్టు ఇలా తీసుకోవడం అత్తింటివారు కోడలిని హింసించడమేనంటూ గతంలో తీర్పు చెప్పింది. అలాగే అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న భర్త అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. వరకట్న వేధింపుల కేసులో భర్త కూడా నిందితుడు అయినందువల్ల అమెరికాకు వెళ్లకూడదని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితులు తన జీవితాన్ని నాశనం చేశారని మాత్రమే మహిళ ఆరోపణలు చేశారని, ఆభరణాలు తీసుకున్నారన్న విషయంపై ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. అయినా నగలు భద్రపరచడం వేధింపుల్లోకి రాదని చెప్పింది. హింసిస్తున్నట్టు ఎలాంటి రుజువులు లేనప్పుడు భర్త దేశంలోనే ఉండాలని ఆదేశించడం ఎందుకో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా ఇటీవల సుప్రీంకోర్టు మరో కేసులో కీలకమైన తీర్పునిచ్చింది. ఇంటిని నిర్మించుకోవడానికి భార్యను డబ్బులు తీసుకురమ్మనడం వరకట్నం వేధింపుల కిందకే వస్తుందని చెప్పింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ వరకట్నం కోసం భర్త, మావయ్యలు పెడుతున్న వేధింపులను తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


By January 15, 2022 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/daughter-in-laws-jewellery-taking-for-safety-not-cruelty-under-section-498a/articleshow/88910698.cms

No comments