Breaking News

వరుసగా మూడో రోజు తగ్గిన కరోనా కేసులు.. కలవరానికి గురిచేస్తున్న మరణాలు


దేశంలో గత మూడు రోజుల నుంచి రోజువారీ కేసుల్లో తగ్గుదల నమోదవుతోంది. అంతేకాదు, ఐదు రోజుల తర్వాత తొలిసారి రోజువారీ కేసులు 2.5 లక్షల్లోపు నిర్ధారణ అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 2.35 లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ముందు రోజుతో పోల్చితే ఇది దాదాపు 10 శాతం తక్కువ. అయితే, కేసులు తక్కువగా నమోదయినా మరణాలు మాత్రం పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా ఏడో రోజు దేశంలో కరోనా మరణాలు 250 దాటాయి. దేశంలో అతిపెద్ద పండుగలు, వారాంతం కావడంతో టెస్టింగ్ సంఖ్య తగ్గింది. దీంతో రోజువారీ కేసుల్లోనూ తగ్గుదల నమోదయ్యింది. ఆదివారం దేశవ్యాప్తంగా 13.13 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. గత 13 రోజుల్లో ఇవే అత్యల్పం. సోమవారం కరోనా మరణాలు అత్యధికంగా పశ్చిమ్ బెంగాల్‌లోనే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లోనే ఉంది. అక్కడ కొత్తగా 31,111 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. తర్వాత కర్ణాటకలో 27,156, ఢిల్లీలో 12,527, పశ్చిమ్ బెంగాల్‌లో 9,385 కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో రోజువారీ కేసులు సోమవారం 50 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 27.99 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, దేశంలో చికిత్సకు రెమ్‌డిస్‌వీర్ వినియోగానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. కోవిడ్ లక్షణాలు కనిపించిన పది రోజుల్లోపు ఆక్సిజన్‌ అవసరమైన రోగుల చికిత్స కోసం (మధ్యస్థాయి నుంచి తీవ్రమైన లక్షణాలు) ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చని పేర్కొంది. సోమవారం జారీచేసిన నూతన కొవిడ్‌ ప్రొటోకాల్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆక్సిజన్‌ అవసరం లేనివారికి, ఇళ్లలోనే ఉండి కోలుకుంటున్న వారికి దీన్ని వాడకూడదని స్పష్టం చేసింది. కేవలం ఆసుపత్రుల్లోఆక్సిజన్‌ అందిస్తున్నవారికి మాత్రమే 5 రోజులపాటు దీన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది.


By January 18, 2022 at 07:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-covid-cases-fall-for-3rd-day-and-positivity-up-and-deaths-rise-to-250/articleshow/88963247.cms

No comments