Breaking News

అఫ్గన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 26 మంది మృతి


అఫ్గనిస్థాన్‌ను భారీ కుదిపేసింది. పశ్చిమ ప్రావిన్సుల్లోని బాడ్ఘీస్‌లోని ఖాడిస్ జిల్లాలో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. భూకంప తీవ్రతకు ఇంటి పైకప్పులు, గోడలు కూలి 26 మంది చనిపోయినట్టు ప్రావిన్సులో ప్రభుత్వ అధికార ప్రతినిధి బజ్ మొహ్మద్ సర్‌వారీ వెల్లడించారు. అఫ్గన్ పశ్చిమ ప్రావిన్సుల్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3‌గా నమోదయినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంపం కారణంగా ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురు గాయపడ్డారని సర్‌వారీ తెలిపారు. ఖాడిస్‌తో పాటు ముఖర్ జిల్లాపై కూడా భూకంప ప్రభావం ఉంది, కానీ మృతులు, క్షతగాత్రుల గురించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన తర్వాత ఇప్పటికే తీవ్ర మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అఫ్గన్‌పై తాజాగా భూకంపం విరుచుకుపడటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అఫ్గన్‌కు అంతర్జాతీయ సహాకారం నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. ఇక, ప్రస్తుతం భూకంపం సంభవించిన ఖాడిస్.. అఫ్గన్‌లో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఒకటి. గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతానికి అంతర్జాతీయ సాయం అంతంతమాత్రంగానే అందుతోంది. అఫ్గన్‌ ముఖ్యంగా హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం తరుచూ భూకంపాలతో సతమతమవుతోంది. ఈ ప్రాంతం యురేషియా, ఇండియా టెక్టానిక్ ప్లేట్స్ కలిసే కూడలి కావడంతో భూకంప ముప్పు అధికంగా ఉంది. భూకంపాలు వల్ల అఫ్గనిస్థాన్‌లో పేలవంగా నిర్మించిన గృహాలు, భవనాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉంటోంది. 2015లో 7.5 తీవ్రత సంభవించిన భారీ భూకంపం వల్ల అఫ్గన్‌లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాసియా పర్వత ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ భూకంపం వల్ల పాక్‌లోనూ భారీగా ప్రాణనష్టం జరిగింది.


By January 18, 2022 at 07:05AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/atleast-26-dead-after-5-3-earthquake-hits-western-province-of-afghanistan/articleshow/88962986.cms

No comments