దేశంలో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో 58 వేలకుపైగా కొత్త కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటల్లో ఏకంగా 58,000 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గతేడాది జూన్ 19 తర్వాత (58,570) ఈ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. సోమవారం నమోదయిన 37,128 కేసులతో పోల్చితే ఇవి 58 శాతం అధికం. మంగళవారం రాత్రి 12 గంటల వరకూ దేశవ్యాప్తంగా 57,974 కేసులు బయటపడ్డాయి. మరో రెండు రాష్ట్రాలు రోజువారీ కేసుల నివేదికలు వెల్లడించాల్సి ఉంది. దేశంలో ఇంత భారీగా పాజిటివిటీ రేటులో పెరుగుదల 2021 జనవరి 28న నమోదయ్యింది. రిపబ్లిక్ డే రోజున టెస్టింగ్ సంఖ్యను తగ్గించడంతో మర్నాడు జనవరి 27న నిర్వహించిన పరీక్షల్లో పాజిటివిటీ 56 నుంచి 63 శాతంగా బయటపడింది. డిసెంబరు 27న దేశంలో కేవలం 6,242 కేసులు బయటపడగా.. అప్పటి నుంచి రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 11.5 లక్షల నమూనాలను పరీక్షించగా.. అంతకు ముందు రోజు ఆదివారం 8.9 లక్షల నమూనాలను పరీక్షించారు. దీంతో సోమవారం పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. మంగళవారం నాటికి దేశంలో పాజిటివిటీ రేటు 5 శాతం దాటింది. పాజిటివిటీ ఈ స్థాయికి చేరితే వైరస్ తీవ్రంగా ఉన్నట్టు పరిగణిస్తారు. రోజువారీ మరణాలు డిసెంబరు 23 తర్వాత 100 దాటాయి. దేశవ్యాప్తంగా 112 మంది కరోనాతో చనిపోయారు. మంగళవారం నమోదయిన కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ కొత్తగా 18,466 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఒక్క ముంబయిలోనే 10,606 కేసులున్నాయి. ముందు రోజుతో పోల్చితే మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు 50 శాతం పెరిగాయి. మహారాష్ట్ర తర్వాత పశ్చిమ్ బెంగాల్‌లో అత్యధికంగా 9,073 కేసులు బయటపడగా.. కోల్‌కతా నగరంలోనే 6,078 కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో పాజిటివిటీ రేటు 19 శాతానికి చేరింది. ఢిల్లీలో 5,481 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు రెట్టింపయ్యాయి. పంజాబ్‌లో 1,027 (ముందు రోజు 419), బిహార్ 893 (ముందు రోజు 344), తెలంగాణ 1,052 (ముందు రోజు 482), ఝార్ఖండ్ 2,681 (ముందు రోజు 1,481), గుజరాత్ 2,265 (ముందు రోజు 1,259) కేసులు నమోదయినట్టు అధికారులు వెల్లడించారు. రోజువారీ కేసుల్లో భారీగా పెరుగుదలతో మూడో వేవ్ దేశంలో ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. గతవారం వరకూ కేరళలో తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు.. మంగళవారం మళ్లీ పెరిగాయి. అక్కడ 3,640 కొత్త కేసులు వెలుగుచూశాయి. డిసెంబరు 15 తర్వాత ఇవే అత్యధికం.
By January 05, 2022 at 07:52AM
No comments