Breaking News

2 లక్షలకు చేరువగా రోజువారీ కేసులు.. 70 శాతం పెరిగిన మరణాలు


గతవారంతో పోల్చితే వ్యాప్తి రేటు స్వల్పంగా తగ్గినా దేశంలో తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.95 లక్షల కేసులు నమోదయ్యాయి. ముందు రోజు నమోదయిన 1.68 లక్షల కేసులతో పోల్చితే ఇవి 17 శాతం అధికం. గత నాలుగు రోజుల నుంచి పాజిటివిటీ రేటు 20 శాతానికిలోపే ఉంటోంది. జనవరి 3 నుంచి 9 మధ్య వరుసగా రెండు రోజులు 56 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. మరోవైపు, ఇప్పటి వరకూ తక్కువగానే ఉన్న కరోనా మరణాలు కూడా రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా మరణాలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. గతవారంతో పోల్చితే మరణాలు 70 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మంగళవారం అక్కడ 34,424 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోల్చితే 1,000 ఎక్కువ. ముంబయిలో మాత్రం రోజువారీ కేసులు వరుసగా నాలుగో రోజూ తక్కువ సంఖ్యలో నిర్ధారణ అయ్యాయి. కొత్తగా 11,647 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కానీ, రోజువారీ టెస్టింగ్ తగ్గడంతో కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం 62 వేల మందికి పరీక్షలు నిర్వహించగా.. 11,650 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 21,259 కేసులు, పశ్చిమ్ బెంగాల్‌లో 21,098 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లో సోమవారం కంటే మంగళవారం రెట్టింపు కేసులు బయటపడ్డాయి. కొత్తగా అక్కడ 2,127 కేసులు వెలుగుచూశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోనూ కొత్తగా 11,089 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒడిశా, గుజరాత్, అసోం, బిహార్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లోనూ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా పెరగడానికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ వ్యాప్తిని కట్టడి చేయాలంటే మూడు అంశాలు ఎంతో ముఖ్యమని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్ కే అరోడా పేర్కొన్నారు. దేశంలో ఉద్ధృతి ఈ నెలలోనే గరిష్ఠానికి చేరుతుందని ఐఐటీ కాన్పుర్‌ నిపుణులు చేసిన అంచనాలు వాస్తవ రూపానికి దగ్గరగా ఉన్నాయన్నారు. ‘‘ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం, అర్హులందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం అనేవి రెండు ముఖ్యమైన అంశాలు. వీటికి తోడు పాలనాపరంగా తీసుకునే కర్ఫ్యూ వంటి చర్యలు కూడా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దోహదపడుతాయి’’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్ ఎన్‌.కే అరోడా స్పష్టం చేశారు.


By January 12, 2022 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-daily-covid-19-cases-rise-17-but-7day-deaths-soar-70/articleshow/88844714.cms

No comments