Breaking News

Sirivennela : సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోవడానికి గల కారణాలు చెప్పిన డాక్టర్ !


టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మంగళవారం కన్నుమూశారు. దాదాపు వారం ముందే ఆయ‌న ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో హాస్పిట‌ల్‌లో చేరారు. నిమోనియా కార‌ణంగా హాస్పిట‌ల్‌లో సిరివెన్నెల చేరార‌న్నారు. అయితే మంగ‌ళ‌వారం ప‌రిస్థితి విష‌మంగా మార‌టం, ఆయ‌న క‌న్నుమూయ‌టం అన్నీ అలా జ‌రిగిపోయాయి. అస‌లు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఏమైంది? బావున్నాడనుకున్న వ్య‌క్తి ఎందుకు హ‌ఠాత్తుగా చ‌నిపోయారు? అని చాలా మంది మ‌దిలో క‌లుగుతున్న ప్ర‌శ్న‌. అయితే సిరివెన్నెల‌కు వైద్యం అందించిన కిమ్స్ ఎండి భాస్క‌ర్‌రావు ఈ విష‌యంపై మాట్లాడారు. ‘‘ ఆరేళ్ల క్రితం శాస్త్రిగారికి క్యాన్సర్ కారణంగా సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వ‌చ్చింది. త‌ర్వాత బైపాస్ స‌ర్జరీ జ‌రిగింది. వారం రోజుల ముందు మళ్లీ ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ అని వ‌స్తే.. దాంట్లో కూడా సగం తీసేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. త‌ర్వాత ఆరోగ్యప‌రంగా కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి. దాంతో ఆయ‌న్ని అడ్వాన్స్ ట్రీట్‌మెంట్ కోసం కిమ్స్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. రెండు రోజులు బాగానే ఉన్నారు. చికిత్స‌లో బాగంగా ప్రికాస్ట‌మీ చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం. మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకింది. గాలి తీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డంతో ఎక్మోమిష‌న్‌పై పెట్టాం. ఆల్ రెడీ బైపాస్ స‌ర్జ‌రీ కావ‌డం, కాన్స‌ర్ ఉండ‌టం, కిడ్నీ డ్యామేజ్ కావ‌డంతో ఇన్‌ఫెక్ష‌న్ శ‌రీర‌మంతా పాకింది. దీంతో ఆయ‌న మంగ‌ళ‌వారం సాయంత్రం తుది శ్వాస విడిచారు’’ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ఓ గొప్ప ర‌చ‌యిత‌ను కోల్పోవ‌డం అనేది తెలుగు సినిమా దుర‌దృష్టం. ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. యువ‌తకు స్ఫూర్తినిచ్చేలా, చైతన్యాన్ని మేలుకొలిపేలా పాట‌లు రాయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా ఎంత చ‌క్క‌గా పాట‌లు రాయ‌గ‌ల‌రో.. అంతే విద్వ‌త్ ఉన్న పాట‌లు రాయ‌డం కూడా ఆయ‌న‌కే చెల్లింది. తెలుగు సినిమా పాట‌ను ఎవ‌రైనా త‌క్కువ చేస్తే ఆయ‌న ఒప్పుకునేవారు కాదు. ఆయ‌న‌లో మంచి గాయ‌కుడు ఉన్నారు. క‌ళ్లు సినిమా కోసం తెల్ల‌రింది లేగండోయ్‌.. అనే పాట‌ను కూడా ఆయ‌న పాడి అల‌రించారు. అలాగే ఆయ‌న మంచి న‌టుడు కూడా. గాయం, మ‌న‌సంతా నువ్వే స‌హా ప‌లు చిత్రాల్లో ఆయ‌న వెండితెర‌పై క‌నిపించి న‌టించి ఆక‌ట్టుకున్నారు. మ‌ళ్లీ ఆయ‌న‌లాంటి రైట‌ర్ పుడ‌తాడా? అని తెలుగు సినీ ఇండ‌స్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. బుధ‌వారం సిరివెన్నెల అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.


By December 01, 2021 at 08:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kims-md-bhaskar-rao-press-meet-about-sirivennela-sitaramasastri/articleshow/88020571.cms

No comments