మహిళల వివాహ వయసు పెంపు.. కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతామని 2020 ఆగస్టు 15 ప్రసంగంలో మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పురుషులకు సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006లో సవరణలను పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి మార్గం సుగమమయ్యింది. దీంతో పాటు ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు సవరణలు చేయనున్నారు. తల్లి మరణాల రేటు తగ్గించి, పోషకాహార లోపాలు పరిశీలించేందుకు జయజైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిశోధించింది. నిపుణుల అభిప్రాయాలను తీసుకుని, డిసెంబరు 2020లో నీతి ఆయోగ్‌కు నివేదికను సమర్పించిన ఈ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. దీన్ని పరిశీలించిన కేంద్రమంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. జనాభా నియంత్రణ కోసమే ఈ సిఫార్సులు చేయలేదని జయజైట్లీ పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, జనాభా నియంత్రణలోనే ఉందని చెప్పిందన్నారు. అందుకే తమ తాము మహిళా సాధికారత కోసం ఈ సిఫార్సులు చేశామని జయ జైట్లీ స్పష్టం చేశారు. ‘సోదరీమణుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వం నిరంతరం శ్రద్ధ చూపుతోంది.. పోషకాహార లోపం నుంచి బాలికలను రక్షించాలంటే వారికి సరైన వయసులో వివాహం చేయడం అవసరం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళలకు వివాహ వయసు 18కాగా.. దానిని 21కు పెంచుతూ తీర్మానం చేశారు. మరోవైపు, ఈ ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిల వివాహ వయసు పెంచొద్దంటూ వందకుపైగా పౌర సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆగస్టు 2020లో ఓ ప్రకటన చేశాయి. వయో పరిమితిని పెంచడం వల్ల మహిళలకు ఒనగూరే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని పేర్కొన్నాయి. పురుషులతో పాటు.. మహిళల వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచితే స్త్రీ-పురుష సమానత్వం రాదని.. పైగా మహిళా సాధికారతకు భంగం వాటిల్లుతుందని అంటున్నాయి. వీలైతే పురుషుల వివాహ కనీస వయసును కూడా 18 సంవత్సరాలకు తగ్గించాలని.. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని సూచించాయి. వివాహ వయసును పెంచడం వల్ల బాల్య వివాహాలు ఆగిపోవని.. పైగా తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని అన్నాయి. వయో పరిమితి పెంచడం వల్ల మహిళ, ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉంటుందని అభిప్రాయపడ్డాయి. మహిళల వివాహ స్థితి, హక్కులను నిరాకరించినప్పుడు కనీస వయస్సును పెంచడం వల్ల ప్రయోజనం ఏముంటుందని పౌర సంఘాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
By December 16, 2021 at 11:48AM
No comments