Breaking News

ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించలేకపోయా.. ఈ నెల జీతం తీసుకోనన్న కలెక్టర్!


సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించలేకపోయినందుకు ఓ ఉన్నతాధికారి డిసెంబరు నెల జీతం తీసుకోరాదని నిర్ణయించారు. తనకు జీతాన్ని నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ‘ప్రజా ఫిర్యాదులను పరిష్కరించలేకపోయా.. నాకు అందాల్సిన డిసెంబరు నెల జీతాన్ని నిలిపివేయండి’ అంటూ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా కలెక్టరు సూచించారు. సీఎం హెల్ప్‌లైన్‌కు అందిన ఫిర్యాదులు వంద రోజులు దాటినా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నందున ఇతర అధికారుల వేతనాన్ని కూడా ఆపాలని జిల్లా ట్రెజరీ అధికారికి ఆయన సూచించారు. జబల్‌పుర్‌ జిల్లా కలెక్టరు కరంవీర్‌ శర్మ.. పెండింగ్ ఫిర్యాదులపై శాఖలవారీగా సోమవారం జరిపిన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, రెవెన్యూ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్ల ఇంక్రిమెంట్లను కూడా ఆపాలని ఆదేశించారు. సమీక్షకు హాజరుకాని జిల్లా మార్కెటింగ్‌ అధికారికి షోకాజ్‌ నోటీసు జారీచేశారు. నిర్దేశిత కాలంలో ఫిర్యాదులను పరిష్కరించాలని, ఒక్కటి కూడా వదిలిపెట్టరాదని అధికారులకు ఆయన సూచించారు. హెల్ప్‌లైన్, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్లకు జీతాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. సీఎం హెల్ప్‌లైన్ లేదా సమాధాన్‌కు సంబంధించిన అన్ని ఫిర్యాదులనూ వచ్చిన 100 రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 100 రోజుల పూర్తయిన వాటిని డిసెంబరు 31 నాటికి చేయాల్సిందేనని హుకుం జారీచేశారు.


By December 29, 2021 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jabalpur-collector-orders-to-withhold-own-salary-over-failure-to-dispose-pending-complaints/articleshow/88558362.cms

No comments