Breaking News

కుప్పకూలిన బంగారు గని.. 38 మంది దుర్మరణం


కుప్పకూలి 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన ఆఫ్రికా దేశం సూడాన్‌లో చోటుచేసుకుంది. సూడాన్‌ రాజధాని ఖార్టోమ్‌కు 500 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ సూడాన్‌ పశ్చిమ్ కోర్డోఫన్ రాష్ట్రం ఎల్ నుహుద్ పట్టణానికి సమీపంలో ఉమ్ దర్సయా బంగారు గనిలో ఈ దుర్ఘటన జరిగినట్లు సూడాన్‌ మైనింగ్‌ విభాగం వెల్లడించింది. కొంతకాలంగా మూసివేసిన గని కూలిపోయిన ప్రమాదంలో 38 మంది చనిపోగా.. మరో ఎనిమిది మంది మంది గాయపడినట్లు తెలిపింది. ఉమ్ దర్సయా బంగారు గని కూలి 38 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని మినరల్ రిసోర్స్ కంపెనీ జనరల్ మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్నాళ్ల కిందట ఈ గనిలో తవ్వకాలను సూడాన్ ప్రభుత్వం నిలిపివేసింది. మైనింగ్‌‌కు అనుకూలంగా లేకపోవడంతో మూసివేయాలని నిర్ణయించింది. అయితే, బంగారం తవ్వకాల కోసం స్థానికులు తరుచూ ఈ గనిలోకి వెళుతుంటారు. కానీ, గనులు కూలిపోకుండా సూడాన్ ప్రభుత్వం కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు. దీంతో సూడాన్‌లో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇదే గనిలో ప్రమాదం చోటుచేసుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పేద దేశమైన సూడాన్.. ఆఫ్రికాలో బంగారం వెలికితీసే దేశాల్లో ఒకటి. 2020లో ఈ దేశం 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది. సూడాన్‌లోని రెడ్ సీ, నహర్ అల్ నీల్, దక్షిణ కోర్డోఫన్, పశ్చిమ కోర్డోఫన్ సహా దాదాపు 2 మిలియన్ల మంది కార్మికులు గనుల తవ్వకాల్లో పనిచేస్తున్నారు. మొత్తం సంప్రదాయ గనుల తవ్వకాల్లో 75 శాతం బంగారమే కావడం విశేషం.


By December 29, 2021 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/38-killed-in-gold-mine-collapse-in-west-kordofan-of-southern-sudan/articleshow/88557804.cms

No comments