Breaking News

పెళ్లి వయస్సు పెంపు బిల్లుపై రగడ... ఏకపక్ష నిర్ణయమన్న విపక్షాలు


యువతుల పెళ్లి వయస్సు 18 నుంచి 21కు పెంచే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించడంపై విపక్ష నేతల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం లోక్‌సభ ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది. అమ్మాయిల పెళ్లి వయస్సును 21 ఏళ్లకు పెంచే దిశగా కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు-2021ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో ఆందోళన జరిగింది. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ మహిళల సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లును తీసుకొచ్చామని స్మృతి ఇరానీ అన్నారు. యువతీ, యువకులు 21 ఏళ్లకు పెళ్లిపై ఒక నిర్ణయానికి వస్తారని అన్నారు. అయితే ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. 18 ఏళ్ల వయస్సున్న వాళ్లు ఓటు వేసి నాయకులను ఎంచుకోవచ్చు కానీ.. పెళ్లి చేసుకోకూడదా..? అని మజ్లిస్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయి కమిటీకి పంపిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది అమ్మాయి పెళ్లి వయస్సును పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. కొంతమంది దీనిని ఆహ్వానిస్తుంటే.. మరికొంతమంది ప్రేమ పెళ్లిలను కట్టడి చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. కేంద్రం మాత్రం బాల్య వివాహాల కట్టడికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందని చెబుతుంది. కాగా అగ్ర దేశాల్లో సైతం అమ్మాయిల పెళ్లి వయస్సు 18గానే ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో 18 ఏళ్లకు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. చైనాలో మాత్రం అమ్మాయిల వివాహ వయస్సు 20 ఏళ్లుగా ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.


By December 21, 2021 at 06:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/women-marriage-age-increase-bill/articleshow/88414793.cms

No comments