టీకా తీసుకోనివారికి కరోనా సోకినా మాకెం సంబంధం లేదు.. సీఎం సంచలన ప్రకటన
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో మహమ్మారిని సమర్ధంగా అడ్డుకుని మోడల్‌గా నిలిచింది కేరళ. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కోవిడ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు ముఖ్యంగా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించబోమని విజయన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు ఇకపై కొవిడ్ బారిపడితే వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యం లేదా ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు.. ఈ విషయాన్ని నిర్ధరించేలా ప్రభుత్వ వైద్యుల వద్ద ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని సమర్పించాల్సి ఉంటుందని విజయన్ పేర్కొన్నారు. ‘ఎలర్జీ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వ్యాక్సిన్ వేసుకోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ వైద్యుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఈ పరీక్షలకు అయ్యే ఖర్చును కూడా వారే భరించాలి’ అని పినరయి విజయన్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లోని విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆఫీసుల్లో పనిచేసేవారు, ప్రజల మధ్య తిరిగే ఉద్యోగులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పటిష్టం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారి ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు. కేరళలో 5,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఇప్పటి వరకూ వ్యాక్సిన్ వేసుకోలేదని నివేదికలు రావడంతో విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 1 నుంచి 15 వరకూ ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇందుకు రాష్ట్రస్థాయి అధికారులు, కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
By December 01, 2021 at 10:27AM
No comments