Breaking News

హైరిస్క్ జాబితాలో ఐరోపా సహా పలు దేశాలు.. ఒమిక్రాన్‌పై కేంద్రం కీలక గైడ్‌లైన్స్


దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రమాదకారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన విషయం తెలిసిందే. నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో భారత్ కొత్త నిబంధనలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించిన అనంతరం ముప్పు జాబితా దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయంలోనే ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఐరోపాలోని 44 దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్సవానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయేల్‌ను అధిక ముప్పు జాబితాలో పేర్కొంది. ఈ దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు నిర్వహించి, ఫలితం వచ్చేవరకు విమానాశ్రయాల్లోనే నిరీక్షించాల్సి ఉంటుంది. ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను అప్‌లోడ్‌ చేసి.. నివేదిక నెగెటివ్‌గా వస్తే 7 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసొలేట్‌తో పాటు నమూనాలను జన్యు విశ్లేషణకు ఇన్సాకాగ్‌ పరిధిలోని ల్యాబొరేటరీకి పంపుతారు. వీరితో సన్నిహితంగా మెలిగినవారిని రాష్ట్రాలు ట్రేసింగ్‌ చేసి.. 14 రోజులపాటు పర్యవేక్షించాలి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఎటువంటి అలసత్వం వద్దని రాష్ట్రాలకు కేంద్ర ఆరో గ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఆర్టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలతో గుర్తించవచ్చని, వీటిని వేగవంతం చేయాలని పేర్కొన్నారు. తాజాగా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. భారీగా కేసులు నమోదయ్యే ప్రాంతాలపై దృష్టిసారించి, ఆ నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని స్పష్టం చేశారు. గ్రామాలపై నిశిత పర్యవేక్షణ ఉండాలని, చిన్నారులు కరోనా బారినపడ్డారేమో పరిశీలించాలని తెలిపారు. అందరికీ తొలి డోసు వేయడంతో పాటు ఇంటింటికీ టీకా కార్యక్రమాన్ని డిసెంబరు 31 వరకు కొనసాగించనున్నట్లు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. కోవిడ్ కట్టడి మార్గదర్శకాలను నెలాఖరు వరకు పొడిగించినట్టు తెలిపారు.


By December 01, 2021 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/strict-norms-come-into-force-for-flyers-from-high-risk-nations-amid-omicron-threat/articleshow/88021574.cms

No comments