Breaking News

రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతి.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!


గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్సీ కబీర్ (25), రన్నరప్ అంజనా షాజన్ (26) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ప్రమాదవశాత్తూ జరగలేదని, ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్‌కు బానిసైన సైజు అనే ఓ యువకుడు ఢీకొట్టినట్టు గుర్తించారు. కారు ప్రమాదంలో అన్సీ కబీర్, అంజనా షాజన్ అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రమాదంలో గాయపడి వారి స్నేహితుడు ఆరు రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అన్నీ కబీర్, అంజనా షాజన్, వారి ఇద్దరి స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో పార్టీకి వెళ్లారు. అదే పార్టీకి వచ్చిన నిందితుడు సైజు.. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఈ రాత్రికి హోటల్‌లో తనతో గడపాలని, అందుకు ఏర్పాట్లు చేస్తానని ఆఫర్ ఇచ్చాడని పేర్కొన్నారు. అతడి ప్రవర్తనతో విసుగుచెందిన అన్సీ, అంజనాలు తమ స్నేహితులతో కలిసి హోటల్ నుంచి వచ్చేశారు. దీంతో వారి వాహనాన్ని సైజు తన కారుతో వెంబడించాడు. డ్రైవర్ సీటులో ఉన్న అబ్దుల్ రహ్మన్ వేగంగా వెళ్లి కారును ఢీకొట్టినట్టు గుర్తించారు. ఇక, అంజనా సోదరుడు అర్జున్ మాట్లాడుతూ.. ‘మా సోదరిని కోల్పోయాను.. ఆధారాలను కూడా లేకుండా చేశారు.. కానీ, పలు విధమైన సమాచారాలు బయటకు వస్తున్నాయి.. పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారని నమ్ముతున్నాం.. పోలీసుల నివేదిక ప్రకారం నిందితుడు సైజు కారుతో వెంబడించి ఢీకొట్టినట్టు చెబుతున్నాయి.. కాబట్టి హోటల్ యజమాని రాయ్ ఎందుకు భయపడుతున్నారు.. సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేశారా? అతడిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, బాధితుల కుటుంబానికి చెందిన ఒకరు సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, నిందితుల కస్టడీని పొడిగించాలని కోరుతున్నారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో సైజును కోర్టులో గురువారం ప్రవేశపెట్టనున్నారు. వేగంగా వచ్చిన వీరి కారు తొలుత ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి.. అదుపుతప్పి చెట్టును ఢీకొందని తొలుతు భావించారు. కానీ, దర్యాప్తులో సైజు కారుతో వెంబడించినట్టు తేలింది. అన్సీ స్వస్థలం తిరువనంతపురంలోని అట్టాంగిల్, అంజనాది త్రిస్సూర్. ఇరువురూ 2019 మిస్ కేరళ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అన్సీ కబీర్.. కాలేజీ రోజుల నుంచి మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. మిస్ బలబార్, లూలూ బ్యూటీ కంటెస్ట్ 2018లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. మిస్ కేరళ 2019 పోటీల్లో విజయం సాధించింది. ఆయుర్వేద వైద్యురాలైన అంజనాకు మోడలింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినా మిస్ కేరళ 2019 పోటీల్లో పాల్గొని, తుది వరకూ గట్టిపోటీ ఇచ్చి మొదటి రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. ‌‌‌


By December 02, 2021 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-models-killed-in-car-crash-were-chased-by-drug-addictor/articleshow/88044881.cms

No comments