Breaking News

నాగాలాండ్ ఘటన: సైన్యంపై మర్డర్ కేసు.. సంచలన ఆరోపణలు చేసిన పోలీసులు


నాగాలాండ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్ గురితప్పి.. 14 మంది పౌరుల ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఒటింగ్‌లో విధ్వంసానికి దిగారు. స్ధానిక సైనిక శిబిరంపై దాడి చేసి, పలు దుకాణాలు, వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దుకాణాలకు అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పివేశారు. తాజా ఘటనల నేపథ్యంలో ఒటింగ్‌లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ సంభవించకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. సైన్యం ఉద్దేశపూర్వకంగానే కాల్పులకు పాల్పడినట్టు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపి పౌరులను హత్యచేసి, గాయపరిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో తమ సహాయం కోరలేదని, దీని గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. వాహనంలో వస్తున్నవారిపై మార్గమధ్యలో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండానే కాల్పులు జరిపారని దుయ్యబట్టారు. ‘ఈ సంఘటన జరిగిన సమయంలో పోలీసులను గైడ్ చేయాలని భద్రతా బలగాలు కోరడం లేదా ఆపరేషన్ కోసం పోలీసు గైడ్‌ను అందించమని పోలీసు స్టేషన్‌కు అభ్యర్థించలేదని గమనించాలి.. అందువల్ల భద్రతా బలగాల ఉద్దేశపూర్వకంగానే పౌరులను హత్య చేయడం.. గాయపరచడం చేశారని స్పష్టంగా తెలుస్తుంది’ అని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. ‘మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బొగ్గు గనుల్లో పనిచేసే ఒటింగ్ గ్రామానికి చెందిన కార్మికులు తిరు నుంచి తమ గ్రామానికి బొలెరో వాహనంలో వస్తున్నారు.. వీరి వాహనం ఒటింగ్.. ఎగువ తిరు మధ్య ఉన్న లాంగ్‌ఖావో వద్దకు చేరుకునేసరికి ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకపోయినా భద్రతా బలగాలు వారిపై గుడ్డిగా కాల్పులు జరిపాయి.. దీంతో చాలా మంది ఒటింగ్ గ్రామస్థులు చనిపోగా.. పలువురికి తీవ్రగాయలయ్యాయి’ అని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సైన్యం ఆపరేషన్‌లో అమాయక పౌరులు చనిపోవడం దురదృష్టకరమని, ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని పేర్కొంది. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల పక్కా సమాచారంతో తిరు-ఒటింగ్ రోడ్డులో ఆపరేషన్‌కు సైన్యం వ్యూహరచన చేసింది.


By December 06, 2021 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nagaland-police-allegation-on-army-unit-army-unit-for-civilians-killing-issue/articleshow/88114913.cms

No comments