పాటలు.. ఆయన చెప్పే మాటలే కాదు.. సిరివెన్నెల వ్యక్తిత్వం అలాంటిది: నాగార్జున ఎమోషనల్
ప్రముఖ సినీ గేయ రచయిత మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. ఆయన ఇక లేరనే వార్త సినీ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో సిరివెన్నెల కన్నుమూశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్ లోని ఫిలిం చాంబర్‌లో ఉంచగా పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెలకు కడసారి చూసేందుకు వచ్చిన అక్కినేని .. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సిరివెన్నెలతో ఎప్పటినుంచో స్నేహం ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు కలిసినా ఏం మిత్రమా అని తీయగా పలకరించేవారని చెబుతూ 'క్రిమినల్' సినిమాలో 'తెలుసా మనసా పాట' జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ''సీతారామ శాస్త్రి గారిని ఎప్పుడు కలిసినా చాలా సరదాగా మాట్లాడేవారు. ఆయనతో బాగా కలిసి ఉన్న పాట ఒకటి గుర్తొస్తోంది. అదే క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా పాట. ఈ సాంగ్ నా కెరీర్ లోనే మరిచిపోలేనిది. ఆ పాటను ఆయన పక్కన కూర్చొని మరీ రాయించుకున్నా. ఈ పాట మదిలో మెదిలినప్పుడల్లా సిరివెన్నెల నాకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఆ స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇవే మాటలు, పాటలు వినిపిస్తుంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'' అని నాగార్జున అన్నారు.
By December 01, 2021 at 12:20PM
No comments