భార్యకు తెలియకుండా ఫోన్ కాల్ రికార్డు చేయడం నేరమే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణలను భర్త రికార్డు చేయడం నేరమని, ఇలా చేయడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని పంజాబ్ హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ‘ఇంకా సంభాషణలు జరిగిన సందర్భాలు లేదా సంభాషణలను రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఎలాంటి ప్రతిస్పందనను పొందారో చెప్పలేం.. నిర్ధారించలేం.. ఎందుకంటే ఓ వ్యక్తికి సంబంధించిన ఈ సంభాషణలు తప్పనిసరిగా వేరొకరి ద్వారా రహస్యంగా రికార్డ్ చేసి ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించింది. ఓ జంట విడాకుల కేసు విషయంలో న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే తన భార్య రహస్య సంభాషణలకు సంబంధించిన సీడీని సమర్పిస్తానని భర్త చెప్పగా భటిండాలోని కుటుంబ న్యాయస్థానం అందుకు అంగీకరించింది. అయితే, తన అనుమతి లేకుండా రికార్డు చేసిన మాటలను సాక్ష్యంగా పరిగణించకూడదంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన మాటలను సాక్ష్యాలుగా పరిగణించకూడదని, కానీ కుటుంబ న్యాయస్థానం దీన్ని పట్టించుకోలేదని ఆమె తరఫు లాయర్ వాదించారు. ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం ఉన్నా దాన్ని సాక్ష్యంగా పరిగణించకూడదని అన్నారు. చాలా క్రూరంగా హింసించడం వల్లనే ఫోన్ సంభాషణలను రికార్డు చేయాల్సి వచ్చిందని భర్త తరఫు న్యాయవాది తెలిపారు. సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 122 ప్రకారం ఇది గోప్యత హక్కును ఉల్లంఘించడం కాదని పేర్కొన్నారు. సంభాషణలు అదనపు సాక్ష్యమేమీ కాదని, ఒక అంశాన్ని నిరూపించడానికి ఉద్దేశించిందని వివరించారు. అయితే, ఈ వాదనలతో ఏకీభవించని న్యాయమూర్తి కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించారు. భటిండాకు చెందిన ఈ దంపతులకు 2009లో ఫిబ్రవరి 20 వివాహం కాగా.. 2011 మేలో ఓ పాప పుట్టింది. పెళ్లి తర్వాత కొద్ది రోజులు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. ఇరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో సదరు భర్త 2017లో విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. విడాకుల కేసు విచారణలో భాగంగా 2019 జులై 9న ఆయన తన భార్య ఫోన్ సంభాషణల రికార్డు సీడీని సమర్పించడానికి కుటుంబ న్యాయస్థానాన్ని అనుమతి కోరాడు. దీంతో 2020 జనవరిలో కోర్టు అందుకు అంగీకరించడంతో భార్య దీనికి అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె వాదనలను సమర్దించిన హైకోర్టు.. కింద న్యాయస్థానం ఆదేశాలను కొట్టివేసింది. ఇది భార్య రాజ్యాంగం హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
By December 14, 2021 at 09:36AM
No comments