Breaking News

బూస్టర్ డోస్ వేసుకున్నా వదిలిపెట్టని ‘ఒమిక్రాన్’.. బాధితుల్లో 40 ఏళ్లలోపు వాళ్లే అధికం!


దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ప్రపంచంలోని 60పైగా దేశాలకు విస్తరించింది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వేరియంట్ కమ్యూనిటీ టాన్సిమిషన్‌లో వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా దేశాల్లో భారీగా కేసులు నమోదుకావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, అగ్రరాజ్యం అమెరికా కొవిడ్‌-19 విలయానికి చిగురుటాకులా వణుకుతోంది. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక కరోనా మరణాలు అక్కడే సంభవించాయి. దాదాపు ఐదు కోట్ల మందికి కరోనా బారినపడగా.. సుమారు 8 లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. గతంలో కాస్త కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇటీవల మళ్లీ రోజుకు సగటున లక్షకుపైగా కోవిడ్ బారిపడుతున్నారు. తాజాగా, ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు కూడా క్రమంగా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని 22 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్‌ వ్యాపించినట్టు సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) వెల్లడించింది. సీడీసీ వివరాల ప్రకారం.. అమెరికాలో 43 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో రెండు డోస్‌ల టీకా వేసుకున్న 34 మంది ఉన్నారు. అంతేకాదు, వీరిలో 14 మందికి బూస్టర్‌ డోసు కూడా పూర్తయినా ఒమిక్రాన్‌ బారిన పడటం గమనార్హం. మరో ఆరుగురు గతంలో కోవిడ్ బారినపడి కోలుకున్నవారు. బారినపడ్డ బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారని తెలిపింది. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన ఒకరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని, ఇప్పటివరకు వేరియంట్‌ మరణాలు నమోదు కాలేదని సీడీసీ పేర్కొంది. ఒమిక్రాన్ బాధితుల్లో దగ్గు, అలసట, ఒళ్లు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలే గుర్తించారు. ప్రయాణాలు, వేడుకలు, పెద్ద ఎత్తున గుమిగూడటంతో ఈ వేరియంట్‌ ప్రబలినట్టు సీడీసీ గుర్తించింది. వ్యాక్సినేషన్‌, తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, వెంటిలేషన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, అనుమానం వస్తే పరీక్షలు చేసుకోవడం, క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వంటి చర్యలే ఏ వేరియంట్‌ నుంచైనా రక్షిస్తాయని సీడీసీ సూచించింది. అమెరికాలో తొలిసారి డిసెంబర్‌ 1న ఒమిక్రాన్‌ కేసు వెలుగుచూసింది. అయితే, నవంబరులో ఈ వేరియంట్ వ్యాప్తి మొదలైనట్టు సీడీసీ అనుమానిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు బయటపడతాయని అంచనా వేస్తోంది. తాజాగా, టెక్సాస్, ఫ్లోరిడాలోనూ ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒమిక్రాన్ బారినపడ్డవారికి లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ, అధికంగా వ్యాప్తి చెందగల ఈ వేరియంట్ ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ‘అదనపు కేసులను గుర్తించి, మరింత అధ్యయనం తర్వాత ఓమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి తీవ్రతపై అవగాహనకు రావచ్చని’ పేర్కొన్నారు. అటు, డెల్టా వేరియంట్ కేసులు అమెరికాను భయపెడుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారంలో ఇన్ఫెక్షన్‌ ఉద్ధృతి భారీగా పెరిగినట్టు అధికారులు గుర్తించారు. గతవారంతో పోల్చితే ఈ వారంలో పాజిటివ్ కేసులు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 40 శాతం మేర పెరిగింది. రోజుకు దాదాపు 7,500 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అమెరికాలో ఇప్పటి వరకూ 20 కోట్ల మందికి పైగా (60.6శాతం) పూర్తిస్థాయిలో టీకా.. 51.7 మిలియన్ల మందికి బూస్టర్ డోసు పూర్తయింది.


By December 12, 2021 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/covid-vaccine-booster-dose-taken-people-also-infected-by-omicron-in-us/articleshow/88233919.cms

No comments