Breaking News

సైకోలా మారి 18 మందిని గాయపరిచిన ఉడత.. మరణ శిక్ష విధించిన అధికారులు!


ఉడత సైకోలా మారి.. రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచిన ఘటన బ్రిటన్‌‌లోని ఫ్లింట్‌షైర్‌లో చోటుచేసుకుంది. బక్లీ పట్టణానికి చెందిన కొరిన్‌ రెనాల్డ్స్‌ అనే పక్షి ప్రేమికురాలికి మచ్చికైన ఓ ఉడత రోజూ ఆమె వద్దకు వచ్చి ఆహారం తీసుకునేది. అయితే, క్రిస్మస్‌కు కొద్దిరోజుల ముందు అనూహ్య సంఘటన జరిగింది. ఆహారం అందిస్తుండగా ఆ ఉడత కొరిన్‌‌ను కరిచి పారిపోయింది. అనూహ్య పరిణామానికి అవాక్కయిన ఆమె.. ఇలా ఎందుకు జరిగిందా? అని ఆలోచించింది. ఈ క్రమంలో కొన్ని ఫేస్‌బుక్‌ పోస్టులు చూడగానే ఆమెకు భయమేసింది. ఆ పోస్టులన్నీ ఉడత గురించే కావడంతో ఖంగుతింది. ఉడత కరిచిందని అందరిదీ ఒకటే ఫిర్యాదు. రెండు రోజుల వ్యవధిలోనే 18 మంది బాధితులయ్యారు. దాదాపు 16 వేల జనాభా ఉండే బక్లీలో క్రిస్మస్‌ వేళ ఇదే హాట్‌ టాపిక్‌‌గా మారింది. సైకో ఉడతకు ‘గ్రెమ్లిన్స్‌’ సినిమాలోని విలన్‌ పేరు (స్రైప్‌) పెట్టారు. దీనిని ఇలాగే వదిలేస్తే ఇబ్బంది తప్పదని భావించిన కొరిన్‌ రోజూ ఆహారం వేసేచోట ఉచ్చు పెట్టి ఉడతను బంధించింది. ఈ ఉడతను ‘ది రాయల్‌ సొసైటీ ఫర్‌ ద ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌’ సంస్థకు అప్పగించింది. దూరంగా అడవిలో వదిలేద్దామంటే స్థానిక చట్టం అంగీకరించదు.. చంపడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించారు. ఓ పశువైద్యుడు ఇంజెక్షన్‌ చేసి ఉడతకు కారుణ్య మరణం ప్రసాదించారు. ఇంత జరిగినా.. ఉడతను నమ్మించి బంధించానే అని కొరిన్‌ విషాదంలో మునిగిపోయింది. ‘సైకో ఉడుత నుంచి పలువుర్ని కాపాడాననే ఊరట ఉన్నా.. జంతు ప్రేమికురాలినైన నా కారణంగా ఈ ఉడుత ప్రాణాలను కోల్పోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నికోలస్ క్రౌథర్ అనే బాధితురాలు ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.. ‘హెచ్చరిక.. దుర్మార్గపు చేస్తోంది.. నన్ను కరిచింది.. మా స్నేహితుడిపై కూడా దాడిచేసింది.. మరికొందరు కూడా బాధితులయ్యారు... మా రెండు పెంపుడు పిలుల్ని కూడా కరిచింది’ అని వాపోయారు. ష్రీన్ డేవిడ్‌సన్ అనే మరో బాధితురాలు.. తాను డస్ట్ బిన్‌ను తీసుకెళుతుండగా డబ్బాల వెనుక నుంచి నాపైకి దూకి చేతిని కొరికింది.. నా వేలుపైన.. కింద భాగంలో దాని పండ్లు గుర్తులు ఉన్నాయి’ ఆమె బోరున విలపించారు. ‘ఉడుత నా చేతిని గట్టిగా పట్టుకుంది.. నేను దానిని వదిలించుకోవడానికి నానా తంటాలు పడ్డాను’ మరో వ్యక్తి చెప్పాడు.


By December 31, 2021 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/psycho-squirrel-terrorizes-injuring-a-staggering-18-people-in-two-days-in-uk/articleshow/88605548.cms

No comments