Breaking News

నాగాలాండ్: తీవ్రవాదులుగా పొరబడి సైన్యం కాల్పులు.. 14 మంది పౌరులు మృతి


నాగాలాండ్‌లో సైన్యం చేపట్టి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో తీవ్రవాదులనుకుని పొరపాటున స్థానికులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మాయన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భద్రతా బలగాలకు చెందిన ఓ జవాన్ కూడా ఈ ఘటనలో చనిపోయినట్టు అధికారులు తెలిపారు. గ్రామస్థులను గుర్తించడంలో పొరపాటు వల్లే ఇలా జరిగిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫుయూ రియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటనని, అందరూ సంయమనం పాటించాలని ఆయన కోరారు. ‘‘మోన్ జిల్లా ఓటింగ్ గ్రామంలో స్థానికుల హత్యకు దారితీసిన దురదృష్టకర సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని కోరుతున్నాను..ఈ ఘటనపై అత్యున్నత స్థాయి సిట్ విచారణ చేపట్టనుంది.. దేశంలోని చట్టం ప్రకారం న్యాయం జరుగుతుంది.. అన్ని వర్గాలూ సంయమనం పాటించాలి’’ అని సీఎం అభ్యర్థించారు. ‘నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు తిరు-ఓటింగ్ రహదారిపై ఆకస్మిక దాడికి వ్యూహరచన చేశాయి.. అయితే పొరపాటున గ్రామస్థులను తిరుగుబాటుదారులుగా భావించి కాల్పులు జరిపారు’ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్థులు చనిపోవడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని భద్రతా బలగాలను చుట్టుముట్టారు. సైనికుల వాహనాలకు నిప్పటించి సైన్యంపైకి దూసుకొచ్చారు. ఈ సమయంలో వారి నుంచి తమను తాము కాపాడుకోడానికి సైన్యం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. సైన్యం కాల్పుల్లో 14 మందికిపైగా మృతిచెందినట్టు తెలుస్తోంది.


By December 05, 2021 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/several-civilians-killed-in-firing-by-security-forces-in-nagaland/articleshow/88101169.cms

No comments