Breaking News

ఆ జిల్లాల్లో 10 శాతానికిపైగా పాజిటివిటీ.. కేంద్రం ఆందోళన.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు


దేశంలో గత 44 రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు 15 వేలలోపు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసులు లక్ష దిగువకు పడిపోయాయి. కేసులు తగ్గుముఖం పట్టాయని ఊరట చెందుతున్నా.. వేరియంట్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. పలు జిల్లాల్లో కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతోందని, కట్టుదిట్టమైన నిఘా ఉంచి జిల్లాస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించింది. పాజిటివిటీ రేటు 10% దాటినా.. 60 శాతానికి పైగా ఆసుపత్రి పడకలు నిండినా.. అలాంటి జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ సహా కఠిన కట్టడి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పది రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రం హెచ్చరించింది. కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికి మించి ఉందని, పశ్చిమ్ బెంగాల్, కేరళ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, పుదుచ్చేరిల్లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్య ఉన్నట్టు పేర్కొంది. ఇలాంటి ప్రదేశాలను కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు ప్రకటించి ప్రజలు గుమిగూడకుండా చూడటం; రాజకీయ, సామాజిక, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిషేధించడం; పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో జన సమూహాన్ని తగ్గించడం తదితర చర్యలు చేపట్టాలని తెలిపింది. ఈ 27 జిల్లాల్లో కరోనా వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. మరింత అప్రమత్తంగా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్నట్లయితే కఠినమైన కంటెయిన్‌మెంట్‌ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరం చేయడం, పరీక్షలు పెంచడం, యాక్టివ్ కేసులను గుర్తించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. అన్నిచోట్ల కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని స్పష్టం చేశారు.


By December 12, 2021 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-letter-to-states-for-focussed-district-level-covid-measures/articleshow/88233360.cms

No comments