Venkaiah Naidu : చిరంజీవి రాజకీయాలకు దూరం కావడం గురించి వెంకయ్య నాయుడు ఏమన్నారంటే...?
రాష్ట్రపతి కావాలని నన్నెవ్వరూ ప్రతిపాదించలేదు. అయినా నేను రాష్ట్రపతి కావాలని చాలా మంది మనసులో అనుకునే మాటను చిరంజీవిగారు నాతో అన్నారు. అయితే మరో ఐదేళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉండాలనే ఆలోచన వస్తేనే..ఎలాగో ఉంటుంది’’ అని అన్నారు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. యోధ డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని తెలుగువారు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంతో పాటు నేటి రాజకీయాలపై వెంకయ్య నాయుడు తనదైన స్టైల్లో స్పందించారు. వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాష్ట్రపతి పదవిని నేను ఆశించడం లేదు. వీలైనంతగా నేను జనంతో తిరగాలనేదే నా కోరిక. అది నా అలవాటు కూడా. నేను దారిలో వెళుతున్నప్పుడు ఎవరినైనా కలవాలని అనిపిస్తే వెళ్లి కలుస్తాను. అదొక ఆనందం. దాన్ని మాటల్లో చెప్పలేం. కానీ ఇప్పుడలా చేయలేకపోతున్నా. కారణం ప్రొటోకాల్. ఎక్కడికీ స్వేచ్ఛగా పోవడానికి లేదు. ఇష్టం వచ్చింది మాట్లాడటానికి లేదు. కొన్ని పద్ధతులున్నాయి. ఇప్పుడు నాకు రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పటి రాజకీయాలు అంత పరిమళంగా లేవు. చిరంజీవి రాజకీయాలు మానుకుని కళామతల్లికి మళ్లీ సేవ చేస్తుండటం మంచి పనైంది. మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ బాగుపడతాయి. చూడటానికి కూడా తను బావున్నాడు. రాజకీయం ఇంతకు ముందున్నంత ఆరోగ్యంగా లేదు. నేను ఎక్కువగా మాట్లాడి రాజకీయ నాయకులను అవమాన పరచడం నాకు ఇష్టం లేదు. అందరూ అలా లేదు. కానీ కొద్ది మంది అయినా జనం ఎక్కువగా చూస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు భాష వింటుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే మనం కూడా అక్కడ నుంచే వచ్చాం కదా!. జబ్బులాగా ఇది పెరుగుతూ వస్తుంది. దీన్ని సంస్కరించాలంటే ప్రజల్లో నుంచి ఆ మార్పు రావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ ‘ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుగారు దేశానికి సేవ చేశారు. ఆయన తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనం, నిర్వచనం. ఓ తెలుగువాడిగా నాకే కాదు, అందరికీ ఆయన రాష్ట్రపతి కావాలనే ఉంది. తెలుగువారందరూ గర్వించేలా వెంకయ్యనాయుడగారు అయ్యప్ప స్వామి సాక్షిగా రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. యోధ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహా చిరంజీవి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, అజహరుద్దీన్, పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.
By November 18, 2021 at 07:53AM
No comments