Tamil Nadu కిలో టమోటా రూ.70కే.. సీఎం స్టాలిన్ బంపరాఫర్
పండించిన పంటకు సరైన ధర లభించక రైతులు టమోటాలను రోడ్డు పక్కన పారేసిన సందర్భాలు కోకొల్లులు. అలాంటి టమోటాలు.. ఇప్పుడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు రూ. 20లోపే ఉన్న కేజీ టమోటా.. ఇప్పుడు వంద దాటేసింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోతెక్కిపోతున్నాయి. పెట్రోల్ తర్వాత ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అకాల వర్షాలతో టమోటా ధరలు ఉన్నట్టుండి ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు టమోటాలను కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేలా తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్సీడీతో నేరుగా ప్రభుత్వ దుకాణాల్లో టమోటాలను తక్కువ ధరకు విక్రయించాలని ఆయన నిర్ణయించారు. బుధవారం నుంచి చెన్నై సహా 12 జిల్లాల్లో కిలో రూ. 70 నుంచి రూ.100 మధ్య అమ్ముతోంది. ప్రజలకు తక్కువ ధరకే టమోటాలను అందజేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వ దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభించామని తమిళనాడు సహాకార శాఖ మంత్రి పెరియసామి అన్నారు. సహకార సంఘాల ద్వారా మొత్తం 15 టన్నుల టమోటాలను కొనుగోలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వరకు 8 టన్నులు విక్రయించామని ఆయన తెలియజేశారు. ఇక, మంగళవారం నుంచి కిలో టమోటా ధర రూ.140 దాటడంతో సామాన్యులకు ఊరట కలిగించాలని స్టాలిన్ భావించారు. టమోటాలతో పాటు ఇతర కూరగాయల ధరలూ ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోయాయి. కూరగాయలను కూడా తక్కువ ధరకే అందజేయనున్నారు. బుధవారం చెన్నై హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమోటా రూ.120 పలగ్గా.. మిగతా చోట్ల రూ.140 వరకు వెళ్లింది. భారీ వర్షాలతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కోయంబేడు మార్కెట్‌కు టమోటాలు రాక తగ్గిపోయింది. పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గి నాణ్యమైన వాటికి గిరాకీ ఏర్పడింది.
By November 25, 2021 at 10:59AM
No comments