Puneeth RajKumar : పునీత్ చదువు చెప్పించిన 1800 పిల్లల బాధ్యత నాదే: హీరో విశాల్
పునీత్ రాజ్‌కుమార్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన సినీ పరిశ్రమకే కాదు, సమాజానికి కూడా ఎంతో సేవ చేశారు. ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలలకు సాయం చేయడమే కాకుండా, 1800 పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఇప్పుడాయన లేరు కదా! మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? అనే సందేహం ఉంటుంది. అయితే మంచి మనసుతో మంచి పనులు చేసేవారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో అండగా నిలబడుతూ ఉంటారు. పునీత్ ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ పనికి ఓ స్నేహితుడిగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు హీరో విశాల్. పునీత్ చదువు చెప్పిస్తున్న 1800 పిల్లలకు వచ్చే ఏడాది చదువుకు అయ్యే ఖర్చును నేను చూసుకుంటానని హీరో తెలిపారు. విశాల్, ఆర్య నటించిన చిత్రం ఈ దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలవుతుంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న స్నేహాన్ని విశాల్ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు. ఆయన బాధ్యతలో తాను కొంత బాగం తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్ ఓ మంచి వ్యక్తి.. ఆయన లేరనే వార్తను చదివినా, వింటున్నా నమ్మాలనిపించడం లేదు. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తన నష్టాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. పునీత్ రాజ్‌కుమార్ మరణం కేవలం సినీ ఇండస్ట్రీకే కాదు. సమాజానికి, ఆయనతో అసోసియేట్ అయిన వారందరికీ పెద్ద నష్టాన్ని చేకూర్చింది. పునీత్‌లాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్‌ను నేను ఇండస్ట్రీలో చూడలేదు. ఆయన ఇండస్ట్రీలో కలిసినా, బయట కలిసినా సరే! ఒకేలా ఉంటారు. నేను చూసిన వారిలో చాలా గొప్ప వ్యక్తి . ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి(పునీత్) ఇన్ని చేయగలుగుతాడా? అనుకుంటే నమ్మలేం. అన్ని మంచి పనులు చేశారు. 1800 పిల్లలకు చదువుకు భరోసానిస్తున్నారు. అలాగే అనాథ పిల్లలకు అండగా నిలబడుతున్నారు. వృద్ధాశ్రమాలకు సాయం చేశారు. అంతే కాదు, ఆయన చనిపోయిన తర్వాత కూడా తన కళ్లను ఇతరులకు దానం చేశారు. ఈ విషయాలను తలుచుకుంటే ఎంతో బాధగా ఉంటుంది. ఇక పునీత్ చదువు చెప్పిస్తున్న 1800 పిల్లల బాధ్యతను వచ్చే ఏడాది నేను చూసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను’’ అన్నారు హీరో విశాల్. హీరో విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఎనిమి’. దీపావళి సందర్భంగా నవంబర్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్.వినోద్ కుమార్ నిర్మాత. అదే రోజున రజినీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న(అన్నాత్త) కూడా విడుదలవుతుంది.
By November 01, 2021 at 08:14AM
No comments