Breaking News

Maharashtra వృద్ధాశ్రమంలో కరోనా కల్లోలం.. 109 మందిలో 67 మందికి పాజిటివ్!


మహారాష్ట్రలోని ఓ ఓల్డేజ్ హోమ్‌లో కరోనా కలకలం రేపుతోంది. థానే జిల్లా వృద్ధాశ్రమంలోని 67 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయ్యింది. వీరిలో 62 మంది పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేసుకున్నవారే కావడం గమనార్హం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న వేళ.. వృద్ధాశ్రమంలో భారీగా కేసులు నమోదుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడటంతో ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. థానే జిల్లా సోర్‌గావ్ గ్రామంలోని మాతోశ్రీ వృద్ధాశ్రమంలో 67 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వృద్ధాశ్రమంలో పలువురికి కరోనా లక్షణాలు బయటపడటంతో శనివారం వైద్యుల బృందం చేరుకుని 109 మందికి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల నివేదికలు సోమవారం ఉదయం రాగా.. 67 మందికి వైరస్ పాజిటివ్‌గా వచ్చింది. ఇటీవల నెలల్లో థానె జిల్లాలో గుర్తించిన అతిపెద్ద కోవిడ్ క్లస్టర్స్‌లో ఇది కూడా ఒకటి. బాధితులందరినీ చికిత్స కోసం థానే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘‘ఖండావలిలో ఉనన మాతోశ్రీ వృద్ధాశ్రమంలో చాలా మంది అనారోగ్యానికి గురికావడంతో శనివారం వైద్యుల బృందం చేరుకుని 109 మందికి పరీక్షలు నిర్వహించింది.. వీరిలో 67 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది’’ అని థానే జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ మనీశ్ రెంగే అన్నారు. వీరిలో 15 మంది నమూనాలను జన్యు పరీక్షలకు పంపినట్టు థానే ఆస్పత్రి సివిల్ సర్జన్ కైలాష్ పవార్ తెలిపారు. మొత్తం 67 మందిలో ఐదుగురు ఈ ఆశమ్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు.. మిగతా 62 మంది వృద్ధులు. వీరిలో 41 మందికి అనారోగ్య సమస్యలున్నాయని, 30 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించలేదని అన్నారు. గ్రామంలో మొత్తం జనాభా 1,130 మంది కాగా.. కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాగా, ఒమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాలని ముంబయి కార్పొరేషన్ ఆదేశాలు జారీచేసింది.


By November 29, 2021 at 01:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/old-age-home-now-containment-zone-after-67-test-covid-positive-in-maharashtra/articleshow/87976741.cms

No comments