Breaking News

Kerala తాత్కాలికంగా శబరిమల యాత్ర నిలిపివేత.. పంబ వద్ద రెడ్ అలర్ట్


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళలోనూ భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల వల్ల పంబా సహా ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరగడంతో శబరిమల అయ్యప్ప దర్శనాలను శనివారం ఒకరోజు నిలిపివేస్తున్నట్టు పథనంతిట్టా జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. పంబా నదిలో వరదలు వెల్లువెత్తుతుండటంతో డ్యామ్ వద్ద రెడ్ అలర్ట్ జారీ చేశారు. కక్కి-అనథోడే అనాతోడ్ రిజర్వాయరు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పథనంతిట్టా అధికారులు చెప్పారు. యాత్రికుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమలలో భక్తుల రాకను నిలిపివేస్తున్నట్టు జిల్లా కలెక్టరు దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని చెప్పారు. మండల-మకరవిళక్కు పూజల కోసం ఈ నెల 15న శబరిమల ఆలయాన్ని తెరవగా.. మర్నాడు నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి, భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా యాత్రికుల రాకను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా గతేడాది మాదిరిగానే ఈసారి కూడా వర్చువల్ క్యూ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఈ ఏడాది రోజుకు 30,000 మంది భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారానే టోకెన్లు జారీచేస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా రోజుకు 5,000 మందికి అవకాశం కల్పించారు.


By November 20, 2021 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-pilgrimage-closed-for-devotees-today-amid-heavy-rains-floods-in-kerala/articleshow/87810864.cms

No comments