Kerala ఇంధన ధరలపై ఆందోళన.. ప్రముఖ నటుడు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ!
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సోమవారం కేరళలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనల్లో హైడ్రామా చోటుచేసుకుంది. ఎర్నాకుళంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనతో ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ట్రాఫిక్‌లో మలయాళీ నటుడు జోజు జార్జ్ రెండు గంటలపాటు చిక్కుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన తన వాహనం దిగి కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో నటుడు జార్జ్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. నిరసన తెలపడంలో తప్పులేదు కానీ, సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదని ఆయన వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జోజు జార్జ్ మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది చాలా పెద్ద విషయం. అందరూ ఇబ్బంది పడుతున్నారు.. ఈ అంశంపై నిరసన తెలపాలి. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించేలా కాదు.. ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు’’ అని వెల్లడించారు. అయితే, ఆయన వాదనలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ.. జోజు మద్యం సేవించి మహిళా కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు.‘‘జోజు మద్యం సేవించి గూండాలా ప్రవర్తించారు’’ అని ఆరోపించిన కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకరన్.. అతడిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘర్షణ అనంతరం నటుడు జార్జ్ జోజుపై పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక, కారు అద్దం పగులగొట్టినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటాం.. ఆందోళనలకు రాతపూర్వకంగా ఎటువంటి అనుమతి తీసుకోలేదు.. నిరసనలు జరుగుతాయని మీడియా ద్వారా సమాచారం అందడంతో పోలీసులను మోహరించాం’ అని ఓ అధికారి తెలిపారు. అయితే, అరగంట పాటు నిరసన తెలపడానికి తాము పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నామని ఎర్నాకులం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మొహమూద్ షియాస్ అన్నారు. మరోవైపు, తనపై కాంగ్రెస్ ఆరోపణలతో సమీపంలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన జోజు.. వైద్య పరీక్షలు చేయించుకోగా ఆయన మద్యం సేవించలేదని తేలింది. తాను గొడవలు కోరుకోవడం లేదని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని జోజు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసనలు తెలపడం మాత్రం సరికాదని ఆయన పునరుద్ఘాటించారు.
By November 02, 2021 at 07:10AM
No comments