Dharwad కాలేజీలో కరోనా కలకలం.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు పాజిటివ్
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా, కర్ణాటకలోని ధార్వాడ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఏకంగా 66 మంది విద్యార్థులు కరోనా బారినపడటం కలకలం రేగుతోంది. వీరంతా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం గమనార్హం. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మొత్తం 400 మంది విద్యార్థుల్లో 300 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ సమయంలో వారికి వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కాలేజీలోని రెండు హాస్టళ్లను సీల్ చేసి, ఎవరినీ బయటకు వెళ్లనీయడంలేదు. విద్యార్థులంతా టీకాలు తీసుకోవడంతో వారిని క్వారెంటైన్‌లో ఉంచినట్లు ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితేష్ పాటిల్ తెలిపారు. కోవిడ్ నిర్దారణ అయిన కొంత మంది విద్యార్థులకు జలుబు, జ్వరం వంటి లక్షణాలు బయటపడగా.. కొందరికి ఎటువంటి లక్షణాలు లేవన్నారు. ‘‘మిగతా 100 మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం.. రెండు హాస్టళ్లను సీల్ చేశాం.. విద్యార్థులకు అవసరమైన చికిత్స, ఆహారాన్ని అందిస్తున్నాం.. ఎవరినీ బయటకు వెళ్లనీయడం లేదు.. ఇప్పటికీ పరీక్షలు చేయించుకోని విద్యార్థులను వేరే చోట క్వారెంటైన్‌లో ఉంచాం.. కాలేజీ ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరినీ పరీక్షించాం... ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించేపనిలో ఉన్నాం’’ అని పాటిల్ పేర్కొన్నారు.
By November 26, 2021 at 08:06AM
No comments