Breaking News

Delhi Pollution టీవీల్లో డిబేట్‌లే పెద్ద పొల్యూషన్.. జస్టిస్ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు


దేశ రాజదాని ఢిల్లీలో కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. టీవీల్లో జరుగుతున్న చర్చలే పెద్ద కాలుష్యంగా మారాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విషయంలో దాఖలైన పిటిషన్‌పై బుధవారం నాటి విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్‌పై , జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో జస్టిస్‌ రమణ టీవీ చర్చలపై ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘‘మిగతా వాటి కంటే ఎక్కువగా టీవీ చర్చలే పెద్ద కాలుష్యంగా మారాయి.. సమస్య ఏమిటో వారికి తెలియదు.. ఏమి జరుగుతోందో అర్థం చేసుకోరు.. న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను వేరే సందర్భాలకు అన్వయించుకుంటారు.. ప్రతి వారికీ ఒక అజెండా ఉంటుంది.. మేం ఏదో ఒకటి మాట్లాడేలా చేసి.. దానిపై వివాదం సృష్టిస్తారు. దీనిపై మేమేమీ చేయలేం.. అసలు సమస్య పరిష్కారం కోసమే ప్రయత్నిస్తాం’’ అని అన్నారు. పంట వ్యర్థాల దహనంపై తాను సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినట్టు ఓ టీవీ చర్చల్లో రోత కలిగించే తనపై విమర్శలు చేశారంటూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాల దహనం వల్ల 4 నుంచి 7 శాతం వరకు మాత్రమే కాలుష్యం ఉంటోందని తాను అన్నట్టు విమర్శలు చేశారని వివరించారు. దీనిపై జస్టిస్‌ రమణ స్పందిస్తూ ‘‘మేమేమీ తప్పు పట్టలేదు. 10 శాతం వరకు కాలుష్యం ఉంటోందని మీరు చెప్పారు.. అఫిడ్‌విట్‌లో 30 నుంచి 40 శాతం అని రాశారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై ఇలాంటి విమర్శలు సహజం’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కాలుష్యానికి రైతులే కారణమన్న వాదనలతో జస్టిస్‌ రమణ ఏకీభవించలేదు. ‘‘స్టార్‌ హోటళ్లల్లో కూర్చొంటున్నవారు రైతులపై ఆరోపణలు చేస్తున్నారు.. 4-5 శాతం కాలుష్యానికి వారే కారకులు... వ్యవసాయ సంస్కరణలు వచ్చిన తరవాత కమతాలు చిన్నవయ్యాయి.. వాటిలో యంత్రాలను వినియోగించే స్థోమత రైతులకు ఉంటుందా? శాస్త్రీయ పరమైన ప్రత్యామ్నాయం చూపించండి.. కాలుష్యానికి వాహనాలే కారణం’’ అని చెప్పారు. ‘పరిశ్రమలు, వాహనాలు, దుమ్ము వంటి కాలుష్య కారకాలను అరికట్టేందుకు ఏడాది పొడవునా తగిన చర్యలు తీసుకోకుండా.. పంట వ్యర్థాలను దహనం చేయకుండా, కాలుష్య పరిశ్రమలను నిషేధించేలా కోర్టులు ఆదేశాలు జారీచేయాలని అధికారులు కోరుకుంటున్నారు.. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో కాలుష్య పునరావృత సమస్య ప్రధానంగా ఉంది’ అన్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం పనితీరును జస్టిస్‌ ఎన్వీ రమణ తప్పుబట్టారు. ‘‘న్యాయమూర్తిగా, అడ్వకేట్‌ జనరల్‌గా చాలా కాలం నుంచి అధికార యంత్రాంగం పనితీరును గమనిస్తున్నా.. దానిలో ఒకరకమైన జడత్వం వృద్ధి చెందుతోంది.. ఏ నిర్ణయమూ తీసుకోవాలని అనుకోవడం లేదు. అన్నీ న్యాయస్థానం చేయాలని కోరుకుంటోంది’’ అని వ్యాఖ్యానించారు.


By November 18, 2021 at 07:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tv-debates-creating-more-pollution-everyone-has-their-own-agenda-says-justice-nv-ramana/articleshow/87769707.cms

No comments